‘పరిషత్’ బరిలోకి దిగుతున్నాం : అఖిలప్రియ
టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎదురు తిరిగారు. పరిషత్ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆమె సంచలన ప్రకటన చేశారు. పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారం చేయాలని ఆమె కేడర్‌కు సూచించారు. ఎన్నికల్లో ప్రజలు కేవం వైసీపీనే కాదు, టీడీపీ అభ్యర్థులను కూడా ఎన్నుకునే అవకాశం ఉందని, అందుకే ఎన్నికల బరిలోకి దిగాలని సూచించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరారని, అలాంటి చోట్ల మాత్రం నోటాకు వేయమని ప్రచారం చేస్తామని అఖిలప్రియ తెలిపారు. అచ్చు ఇదే విధమైన ప్రకటన మరొకరు కూడా చేశారు. టీడీపీ అగ్రనేత అశోక గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా ఇదే విధమైన నిర్ణయాన్ని ప్రకటించారు. తాము విజయనగరం నియోజకవర్గంలో పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. కార్యకర్తల కోరిక మేరకు రంగంలోకి దిగుతామని తేటతెల్లం చేశారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు అప్రజాస్వామికంగా మారాయని మండిపడ్డారు. కొత్త కమిషనర్ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని చంద్రబాబు ఆక్షేపించిన విషయం తెలిసిందే.













