YS Jagan: మార్చడమే మంచిది, సీనియర్ నేతలకు బై బై…!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ(YSRCP) ని ఎలాగైనా సరే బలోపేతం చేసి, తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ (YS Jagan) నానా కష్టాలు పడుతున్నారు. పార్టీలో కొంతమంది నేతలు బయటకు వెళ్లిపోవడం, మరి కొంతమంది నేతలు సమర్థవంతంగా లేకపోవడంతో జగన్ ఇప్పుడు కీలక అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపద్యంలోనే కొంతమంది నేతలను పదవుల నుంచి పక్కన పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్కే రోజాను జగన్ పక్కన పెట్టగా.. త్వరలోనే మరి కొంతమంది కీలక నేతలను కూడా పార్టీ పదవుల నుంచి తప్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
రాజకీయాల్లో ఆసక్తి ఉన్న యువ నాయకులను ప్రోత్సహించడానికి జగన్ సిద్ధమయ్యారు. అందుకే ఆసక్తితో ఉన్న రాయలసీమ పారిశ్రామికవేత్తలకు ఇప్పటినుంచే ఆయన సీటు హామీలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపద్యంలోనే కర్నూలు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు కోసం జగన్ శ్రీకారం చుట్టే సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటికే నగిరి, సింగనమల నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వాన్ని జగన్ మార్చేందుకు రంగం సిద్ధం చేశారు.
అటు చిత్తూరు జిల్లాలో కూడా యువ నాయకులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీలలో అసహనంగా ఉన్న నేతల వైపు కూడా జగన్ దృష్టి పెడుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండి తన వెంట నడిచే నాయకుల వైపు జగన్ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో మండల స్థాయి నాయకత్వంలో కొంతమంది బలంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందర్నీ.. ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నాలు చేసిన నాయకులపై కూడా జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం. అటు కాంగ్రెస్ పార్టీ నేతల వైపు కూడా జగన్ ఇప్పటికే దృష్టి సారించి కొంతమందిని పార్టీ లోకి ఆహ్వానించారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ చేరికలు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.













