అమరావతిలో వేయి పడకల క్యాన్సర్ ఆసుపత్రి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తలపెట్టిన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఫిబ్రవరి మొదటి వారంలో భూమి పూజ చేయనున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. వేయి పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఆసుపత్రికి సంబంధించిన సమాచారంతో రూపొందించిన న్యూస్ లెటర్‌ను బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నెలకోసారి ప్రచురించే ఈ న్యూస్ లెటర్లో అరుదైన క్యాన్సర్ శస్త్ర చికిత్సలు, రోగులకు అందే సేవలతోపాటు ఉద్యోగులకు సంబంధించిన సమాచారం, సంస్థ చేపట్టే కార్యకలాపాలను వివరిస్తారన్నారు. తన తల్లి బసవతారకం పేరుతో నిర్మితమైన ఈ ఆసుపత్రి సాధిస్తున్న ప్రగతి తనకెంతో సంతృప్తినిస్తోందన్నారు.













