Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులపై బ్యాంకుల మెలిక..తల్లుల నిరాశ..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన తల్లికి వందనం (Thalliki Vandanam) పథకం కొన్ని సమస్యలతో వార్తల్లో నిలుస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తూ ప్రభుత్వం తన హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే దీనికి సంబంధించి బ్యాంకుల వద్ద తల్లులు ఎదుర్కొంటున్న అవరోధాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాకు రూ.13,000 జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అదనంగా పాఠశాల అభివృద్ధి కోసం మరో రూ.2,000ను స్కూల్ మేనేజ్‌మెంట్ నిధికి కేటాయించారు. గురువారం నాటి నుంచి ఈ నిధులు తల్లుల ఖాతాల్లోకి జమ అవ్వడం ప్రారంభమైంది. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో తల్లులు బ్యాంకుల వద్దకు పోవడంతో అక్కడ ఓ రకమైన గందరగోళం నెలకొంది.
తిరుపతి జిల్లా (Tirupati District) లోని వాకాడు ఎస్సీ కాలనీకి చెందిన ఒక తల్లి తన కుమారుడి చదువు కోసం ఖాతాలో జమ అయిన రూ.13,000ను డ్రా చేసుకోవడానికి బ్యాంక్‌కి వెళ్లింది. కానీ అక్కడ బ్యాంకు అధికారులు ఆమెకు షాక్ ఇచ్చారు. ఆమెకు పొదుపు రుణం (Loan dues) బాకీ ఉందని, అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆ రుణం తీర్చడానికే జమ చేశామని చెప్పారు. తల్లి ఎంత చెప్పినా ఆమె మాట వినకుండా, డబ్బు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇదే పరిస్థితి చాలా తల్లులు ఇతర ప్రాంతాల్లో కూడా ఎదుర్కొన్నారు.
గూడూరు (Gudur) ప్రాంతంలో ఈ సమస్యపై స్పందించిన ఉప విద్యాధికారి, బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే ఇది ఒక్క గూడూరుకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని స్పష్టంగా తల్లులు చెబుతున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్వయంగా తెలుసుకొని జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం పంపిన డబ్బును బ్యాంకులు రుణాల క్లియరెన్స్‌కి ఉపయోగించడం ఎంతవరకు న్యాయమో అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. బ్యాంకల నిబంధనలు తల్లుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా అవి తగినవారికి అందకపోతే, ఆ పథకం ప్రయోజనం నెరవేరదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది చక్కదిద్దడానికి అధికారుల నుంచి వెంటనే చర్యలు రావాలని ప్రజలు కోరుతున్నారు.