ఏపీ బంద్ ప్రశాంతం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. రహదారులపై బైఠాయించారు. మానవహారాలు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు నల్లబాడ్జీలు ధరించాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదుట సీపీఎం, సీపీఐ, సాధన సమితి నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకుపోయిన కాంగ్రెస్, వామపక్ష మహిళా నేతలు ఒకటో నెంబర్ రైల్వే ట్రాక్‌పైకి దిగి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం నేత సీ.హెచ్ బాబురావు పాల్గొన్నారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.
తిరుపతి గాంధీరోడ్డులోని నాలుగు కాళ్ల మండపం వద్ద రహదారిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సరదాగా కబడ్డీ అడారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ నాయకులు బస్సులు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులకు రోజా పూలు ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. మద్దిలపాలెం కూడలి వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడకపోవడం విచారకరమన్నారు. విజయవాడ గాంధీనగర్‌లో ఏపీ ఎన్జీవోల సంఘం నిరసన ర్యాలీ నిర్వహించింది. అమరావతిలో మంత్రులు భూమా అఖిలప్రియ, పరిటాల సునీత, సహచర మహిళ ఎమ్మెల్యేలతో కలిసి నలుపు వస్త్రాలు ధరించి నిరసన తెలిపారు.













