బాలినేని కింకర్తవ్యం..?
ప్రకాశం జిల్లా వైసీపీకి అడ్డాగా చెప్పుకుంటారు. అక్కడ పార్టీకి ఏం సమస్య వచ్చినా బాలినేని శ్రీనివాసరెడ్డి ..ముందుండి చూసుకునేవారు. అలాంటి బలమైన నేత.. సార్వత్రిక ఎన్నికల ముందు ఉస్సురంటున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. హైకమాండ్ దగ్గర మాట చెల్లుబాటు కాకుండా పోయింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ స్థానం కేటాయించేది లేనేలేదని ఖరాఖండిగా తేల్చేసింది. ఆయనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రతిపాదనను అంగీకరించలేదు.. మాగుంట కాకుంటే కనీసం తన కుమారుడు ప్రణీత్రెడ్డినైనా పరిగణనలోకి తీసుకోవాలని చేసిన ప్రతిపాదననూ తిరస్కరించింది.
అదే సమయంలో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారని చెప్పింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త బాధ్యతలను కూడా ఆయనకే కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో బాలినేనికి పరాభవం ఎదురైనట్లైంది. ఇదే మీ నిర్ణయమైతే నా దారి నేను చూసుకుంటానంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ను బుజ్జగించే యత్నం చేసినా వినలేదు. భవిష్యత్తు కార్యాచరణపై కుటుంబీకులతో సమాలోచనలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది.
ఒంగోలు పార్లమెంట్ స్థానం వైసీపీ అధిష్ఠానికి చిక్కుముడిగా మారింది. బాలినేని ఎంతగా పట్టుబట్టినా మాగుంటకు అవకాశం ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇళ్లస్థలాలకు నిధుల మంజూరుతో ఆయన కాస్తంత మెత్తబడినట్లు కనిపించినా, ఆ వెంటనే స్వరం మార్చారు. మాగుంట కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈలోపు చెవిరెడ్డి పేరు ఖరారుచేయడంతో..ఈ నిర్ణయంపై పార్టీ పెద్దల దగ్గర బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బాలినేని మరోసారి అలకబూనిన విషయం తెలుసుకున్న అధిష్ఠానం సలహాదారు సజ్జలని రంగంలోకి దింపింది. ఆయన నేరుగా హోటల్ వద్దకు వెళ్లి సుమారు గంటన్నరసేపు బుజ్జగింపులు చేపట్టారు. పార్టీలో మీ ప్రాధాన్యానికి ఢోకా లేదని హామీ ఇచ్చినప్పటికీ బాలినేని శాంతించలేదని సమాచారం. సాయంత్రం మూడు గంటలకు సీఎంతో భేటీకి అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ సీఎంవోకు వెళ్లకుండా మాగుంట సీటు విషయం తేల్చాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. బుజ్జగించినా ప్రయోజనం లేకపోవటంతో చేసేదేమీ లేక సజ్జల వెనుదిరిగారు. మాగుంటకు టికెట్ కేటాయించలేమంటూ స్పష్టం చేయడం.. ప్రతిపాదనలను కనీసం ఖాతరు చేయకపోవడంతో బాలినేని తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు భాస్కర్‌రెడ్డిలతో హోటల్లో సమావేశమై భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. బాలినేని నిర్ణయం కోసం అనుచరులు ఇప్పుడు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆయన మాగుంటతో కలిసి టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందని, లేదంటే షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌లోకి వెళ్లడాన్నీ కొట్టి పారేయలేమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మాగుంట విషయం ప్రస్తావించొద్దు అని అధిష్ఠానం పది రోజుల క్రితమే బాలినేనికి సూటిగా చెప్పేసింది. ఆ తర్వాతే ఇళ్ల స్థలాలకు భూ సేకరణ నిమిత్తం నిధులు మంజూరు చేసింది. అప్పటికి 42 రోజులుగా ఒంగోలుకు దూరంగా ఉన్న బాలినేని విజయోత్సవం పేరుతో ఒంగోలులో బల ప్రదర్శన నిర్వహించారు. ఇక మాగుంట జోడీ లేకపోయినా ఆయన ఒంగోలు నుంచే బరిలో ఉంటారని అంతా భావించారు. ఇంతలోనే ఒక్కసారిగా కథ మారిపోయింది. ఈ నెల 27న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆమె.. అదే సమయంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే బాలినేనిలను మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఈ అంశం కూడా వైసీపీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.













