వైసీపీకి బాలినేని గుడ్ బై..!?
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో కోల్పోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఆ పార్టీని వీడుతున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్న నేతలెంతో మంది ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. ఏదైనా మంచి అవకాశం వస్తే పార్టీని వీడేందుకు కూడా పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు. అధికార కూటమి పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
తాజాగా వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలందుతున్నాయి. బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. బంధువు కూడా.! వైఎస్ జగన్ పార్టీ పెట్టిన తర్వాత 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో ఒంగోలు నుంచి గెలిచారు. 2019లో మరోసారి గెలిచిన ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. అయితే రెండున్నరేళ్ల తర్వాత బాలినేనిని కేబినెట్ నుంచి తొలగించారు జగన్. ఇది బాలినేని అసంతృప్తికి కారణమైంది. అప్పటి నుంచి పార్టీలో అసంతృప్తితో ఉన్నారు.
జిల్లాలో మంత్రిగా ఉన్నా తన మాట నెగ్గట్లేదని బాలినేని చాలాసార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకే జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. దీంతో కొంతకాలం ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండిపోయారు. అయితే జగన్ ఒకసారి తాడేపల్లి పిలిపించుకుని మాట్లాడడంతో సర్దుకుందని భావించారు. అయితే తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని అవకతవకలపై కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యవహారంలో పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందట్లేదు. ఇది బాలినేని ఆగ్రహానికి కారణమవుతోంది.
పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న తనను కాదని.. ఇతరులను జిల్లాలో ప్రోత్సహించడం, మంత్రివర్గం నుంచి తప్పించడం.. జిల్లాలో తన మాట నెగ్గకపోవడం, కేసులు నమోదవుతున్నా పార్టీ నుంచి సహకారం లేకపోవడం.. లాంటి అనేక కారణాలు బాలినేని అసంతృప్తికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ఆయన తన అనుచరులందరినీ పిలిపించుకుని పార్టీకి రాజీనామా విషయం చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్లంతా పార్టీని వీడినా తన వెంటే ఉంటామని చెప్పడంతో బాలినేని రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన అధికారికంగా పార్టీకి రాజీనామా ప్రకటన చేయబోతారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.













