మెట్టుదిగిన బాలినేని… ఫలించిన వైసీపీ ప్రయత్నం
వైసీపీ హైకమాండ్ బుజ్జగింపులు పనిచేశాయో.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని ఆలోచనలో పడ్డారో తెలియదు కానీ.. బాలినేని శ్రీనివాస రెడ్డి వెనక్కు తగ్గారు. నిన్నటి వరకూ తగ్గేదే లేదంటూ బీష్మించుకు కూర్చున్న మాజీమంత్రి బాలినేని.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. దీంతో ఒంగోలు వైసీపీ సంక్షోభానికి శుభం కార్డు పడినట్లైంది.
ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా మాగుంట శ్రీనివాసరెడ్డినే పెట్టాలంటూ పట్టుబడుతూ వస్తున్న మాజీమంత్రి బాలినేని మెట్టుదిగారు. నేరుగా హైకమాండ్ బుజ్జగింపులతో ఓ అడుగు వెనక్కేసి ఎంపీ అభ్యర్దిగా పార్టీ అధిష్టానం ఎవరిని సూచించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు బాలినేని.. దీంతో గత కొద్దికాలంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో నెలకొన్న అయోమయానికి చెక్ పడింది.. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైసీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేయటంతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ భాద్యతలను కూడా అప్పగించేందుకు కూడా అధిష్టానం సిద్దమైంది.. అయితే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని బరిలో నిలిపితే సహకరించలేనని ముందుగా అధిష్టానానికి చెప్పిన బాలినేని ఒక్కరోజు లోనే సర్దుకున్నారు.
మొదటి నుంచి మాగుంట కోసం బాలినేని పట్టుబడుతుండగా.. వైసీపీ అధిష్టానం ససేమిరా అంటూ వస్తోంది. బాలినేనిని కలసి సజ్జల మంతనాలు జరిపినా వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు.. మరోవైపు మాగుంట కూడా ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. మొదటి నుంచి మాగుంట కోసం పట్టుబడుతూ వస్తున్న బాలినేని మాత్రం మాగుంటకు కాకుంటే.. తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి అయినా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధిష్టానం మాత్రం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
వరుస పరిణామాలు బాలినేనికి ఇబ్బందికరంగా మారాయి.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ప్రచారం ఎక్కువైంది.. ఎవరి విషయంలోనూ వెనక్కు తగ్గని సీఎం జగన్ పలు విషయాల్లో బాలినేని కోసం ఓ అడుగు తగ్గి ఆయనకు మద్దతుగా నిలిచారు.. మాగుంట వ్యవహారంలో సీఎం జగన్ వైఖరి స్పష్టంగా ఉండటంతో బాలినేని కూడా ఓ అడుగు వెనక్కు తగ్గారు.. పార్టీ అధిష్టానం దృష్టిలో ప్రతీ అంశంలో తాను మాత్రమే వారిని అడుగుతున్నట్లు.. అలుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.. ఎంపీ అభ్యర్థి విషయంలో అన్నీ నియోజకవర్గాల అభ్యర్దుల గెలపుకు ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే మాగుంట కోసం ప్రయత్నం చేశానే తప్ప వేరే కారణం ఏమీ లేదని బాలినేని తెలిపారు.
ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనేది తన ఆశ అని.. దాని కోసం సీఎం జగన్ ను ఒప్పించి తెచ్చుకున్నామన్నారు.. మాగుంట వ్యవహారంలో మిగతా నియోజకవర్గాల ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు పట్టీ పట్టనట్లున్నారని.. దీంతో అధిష్టానం దృష్టిలో తాను ఒక్కడినే ప్రశ్నించినట్లవుతోందన్నారు.. అందుకే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలిని నిర్ణయించుకున్నట్లు బాలినేని స్పష్టం చేశారు.. ఎంపీగా బరిలో మాగుంట పోటీలో ఉంటే …ఎమ్మెల్యే స్థానాల్లో విజయావకాశాలు ఉంటాయని అడిగానన్నారు బాలినేని.. మిగతావాళ్ళకు పట్టనప్పుడు తాను ఒక్కడినే పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నానన్నారు.. మరోవైపు సీఎం పిలిస్తే వెళ్లనన్నానని ప్రచారం చేయటం కరెక్ట్ కాదన్నారు బాలినేని.. తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఒంగోలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పనిచేస్తానని.. ఎవరు ఎంపీ అభ్యర్ధి వచ్చినా తనకు ఏ అభ్యంతరం లేదన్నారు.













