బాలయ్యా ఒకరోజు రావయ్యా!
తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీని అధిగమించేందుకు నందమూరి బాలకృష్ణ ప్రచారానికి రావాలని నంద్యాల పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే సగం మంది మంత్రులు నంద్యాలలో తిష్టవేసినా వారితో ఉపయోగం లేదని, బాలకృష్ణ వస్తేనే ప్రచారం ఊపందుకుంటుందని ఇప్పటికే నంద్యాల నేతలు అధిష్టానానికి సృష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాస్లో ఇమేజ్ ఉన్న బాలకృష్ణను ప్రచారానికి పంపించాల్సిన అవసరం ఉందని స్థానిక నేతలు టిడిపి నాయకత్వాన్ని కోరారు. 16, 17, 18 తేదీల్లో ఒక్కరోజు బాలయ్య ప్రచారం చేసినా సరిపోతుందని, పార్టీకి సానుకూలంగా ఉంటుందని సృష్టం చేశారు. దీనితో బాలయ్య డేట్ల కోసం ప్రయత్నిస్తున్నా ఆయన నుంచి ఇంతవరకూ స్పందన లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.













