ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని… గుడిలో ఉన్న లింగాన్ని కూడా
ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్నీ మింగేసే రకం అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలి పెమ్మసాని థియేటర్లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారికి ఏప్పుడు ఏ ఆపద వచ్చిని, ఏ అవసరమున్నా ఆయన ముందుండేవారు. ఆనాడు సీమ ప్రజలు కరువుతో ఇబ్బందిపడుతున్న రోజుల్లో జోలిపట్టిన గొప్ప సంఘసంస్కర్త ఆయన. తెలుగు జాతి విలువపోతున్నప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్న రోజుల్లో బడుగు, బలహీన శ్రామిక వర్గాల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సింహాలా గర్జించి, మడమతిప్పకుండా పోరాడిన వ్యక్తి, తెలుగు దేశాన్ని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నిరూపించారు. బడుగు, బలహీనులను సైతం అధికార పీఠంపై కూర్చొపెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్. రెండు రూపాయాలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదవాడికి ఇల్లు ఇలా ఎన్నో సంస్కరణలు ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తాయి అని అన్నారు.
ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు. ఓటు వేశారు. అనుభవిస్తున్నారు. ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అన్నారు గురజాడ. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి. ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగేరకం. కాబట్టి మీరే ఆలోచించుకోండి అని బాలయ్య వ్యాఖ్యానించారు.













