హిందూపురం నాదే.. హ్యాట్రిక్ కొట్టి తీరుతా.. బాలకృష్ణ
ఆంధ్రాలో జరగబోయే ఎన్నికలు మహాసంగ్రామం లాంటివి అని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు కష్టపడి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హిందూపురం నియోజకవర్గంలో జరిగిన కూటమి ఉమ్మడి కార్యాచరణ, విశృత స్థాయి సమావేశం కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ పై ఆయన విమర్శల అస్త్రాలు సంధించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యవస్థను నాశనం చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమను రక్త చరిత్రగా మార్చారని.. మధ్య నిషేధం మాట పక్కన పెట్టి కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్ళింది అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబు లాంటి నాయకుడు అవసరమని బాలకృష్ణ చెప్పారు. ఈసారి కూడా హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టి చూపిస్తానని సవాల్ చేశారు.













