బాలయ్య డబుల్ హ్యాట్రిక్ తో ఫ్యాన్స్ ఖుషీ
ఇవాళ ఎలక్షన్స్ లో గెలిచి నందమూరి బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ అందుకున్నాడు. అదేంటి బాలయ్య ఎమ్మెల్యేగా గెలడం ఇది మూడోసారే కదా అనుకోవచ్చు. హిందూపూర్ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న బాలయ్య మరోవైపు సినిమాల్లో కూడా అంతే జోష్ తో సినిమాలు చేస్తూ విజయాలందుకోవడం వల్ల డబుల్ అని అనాల్సి వచ్చింది.
అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని సక్సెస్ ను అందుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. అటు సినిమాల్లోనూ, ఇటు పాలిటిక్స్ లోనూ ఈ హ్యాట్రిక్ ఫీట్ సాధించడం వల్ల బాలయ్య ఫ్యాన్స్ ఎంతో గర్వపడుతున్నారు.
అంతేకాదు ముందు రెండు సార్లు గెలిచిన దాని కంటే ఎక్కువ ఆధిక్యంతో బాలయ్య గెలవడం చూస్తుంటే అక్కడి ప్రజల ప్రేమ, మద్దతు బలంగా దక్కినట్లు అర్థమవుతుంది. దీంతో బాలయ్య ఆనందం మామూలుగా లేదు. అంతేకాదు తన బావ చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం, మరోవైపు అల్లుడు లోకేష్ మంగళగిరి నుంచి ఏపీలోనే భారీ మెజారిటీ దక్కించడంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. క్యాంపైన్ టైమ్ లో అలుపు లేకుండా ఎండల్లో తిరిగిన బాలయ్య దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకున్నందుకు ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు.













