వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గున్తోటి వెంకట సుబ్బయ్య ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రిందటే కోలుకొని, ఇంటికి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. కుమార్తె ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని మధ్యాహ్నం బద్వేల్‌కు తరలిస్తారు. ఎమ్మెల్యే మృతిపట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య స్వస్థలం బద్వేలులోని మల్లెలవారిపల్లి. కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. అనంతరం కామినేని, అపోలో హాస్పిటల్స్‌లో వైద్యునిగా సేవలందించారు. 2019 లో తొలిసారిగా వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు.













