జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎందుకు ? అయ్యన్న
విశాఖపట్నంలో భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని, వాటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు చేసిన ఆర్జీలకే దిక్కులేనప్పుడు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎందుకని నిలదీశారు. సిరిపురంలో వున్న క్రస్టియన్ సంస్థకు చెందిన సీబీసీఎన్సీ భూముల్లో 18 వేల చదరపు గజాల స్థలంలో తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు. 3,600 గజాల స్థలం సాంఘిక సంక్షేమ విభాగానికి ఇచ్చారు. అక్కడ విపరీతంగా తవ్వుతున్నారు. దేని కోసమని అడిగితే అధికారులు నవ్వుతూ సమాధానం దాట వేస్తున్నారు. 2006 సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాను. ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా సదరు అధికారులకు కూడా తెలిపాను. భూమి ఎవరిది? ఎవరు తవ్వకాలు చేస్తున్నారో చెప్పాలని కోరాను. స్థలం ఎవరిదో తెలియకుండా ప్రైవేటు వారికి అపార్టుమెంట్లు కట్టడానికి ఎలా అనుమతులు ఇచ్చారో తెలియాలి అని అన్నారు. 30 రోజుల్లో సమాధానం రావాలని లేదంటే అప్లేట్ అథారిటీకి వెళ్తామని తెలిపారు. అప్పటికీ ఇవ్వకపోతే ఇదే అంశంపై హైకోర్టుకు కూడా వెళ్తామని మెచ్చరించారు.













