Ayyanna Patrudu: కొడుకుల కోసం అయ్యన్న మాస్టర్ స్కెచ్..
ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు( Speaker Chintakayala Ayyanna Patrudu ) , తన రాజకీయ వారసులుగా కుమారులను ముందుకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విజయ్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2024లో అనకాపల్లి లోక్ సభ టికెట్ ఆశించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. అయితే, విజయ్‌కు మంచి నామినేటెడ్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. త్వరలో జరిగే నామినేటెడ్ పదవుల పందేరంలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
ఇక, తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు, రెండవ కుమారుడు రాజేష్ నర్శీపట్నం మునిసిపాలిటీలో (Narsipatnam municipality )కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. నర్శీపట్నం మునిసిపాలిటీ ప్రస్తుతం వైసీపీ ఆధీనంలో ఉన్నా, కౌన్సిలర్లతో సంబంధించిన విషయాలు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు, ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ చేరికలతో, టీడీపీ కూటమి బలం నర్శీపట్నంలో పెరిగినట్లు తెలుస్తోంది.
అయ్యన్న, తన రెండవ కుమారుడు రాజేష్‌ను నూర్తీర్ణమైన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు, నర్శీపట్నం మునిసిపాలిటీలో కీలక పదవులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా, ఎస్సీ మహిళా రిజర్వుడు చైర్పర్సన్ పదవి తమ పార్టీకి చెందినవారికి అప్పగిస్తూ మరోపక్క కీలకమైన వైస్ చైర్మన్ పదవిని తన కొడుకు రాజేష్‌కు అప్పగించే దిశగా అయ్యన్న పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా అయ్యన్న మార్కు రాజకీయం ఎలా ఉంటుందో ఈ విషయాలు పరిశీలిస్తే అర్థమవుతుంది.
అయ్యన్న, తాను నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించుకున్నారు. తన పెద్ద కుమారుడు విజయ్‌కు లోక్ సభ టికెట్ కోసం మరియు చిన్న కుమారుడు రాజేష్‌కు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అయ్యన్న స్కెచ్ మాత్రం మామూలుగా లేదు.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను తన కుటుంబ రాజకీయాలకు వేదికగా చేయడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు గట్టిగా కనిపిస్తోంది. మరి ఈ ప్రయత్నాల్లో ఆయన ఎంతవరకు సక్సెస్ సాధిస్తారు అనేది వేచి చూడాల్సిందే.













