Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడు పై ఆదివాసుల ఫైర్..
స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) తెలుగుదేశం పార్టీలో (Telugu Desam party) సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అనుభవజ్ఞుడైన నాయకుడు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) తర్వాత అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, మంత్రిగా కూడా ఎన్నో సార్లు వ్యవహరించారు . పార్లమెంటులో కూడా ఎంపీగా సేవలందించారు. ఇప్పుడు స్పీకర్ పదవిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమైన పదవులన్నింటినీ అనుభవించిన అయ్యన్నపాత్రుడు, ఇటీవల కాలంలో అనుకోని వివాదాల్లో చిక్కుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజలతో ఎప్పుడూ ఎలాంటి విభేదాలు లేకుండా, హుందాగా సాగింది. విశాఖ జిల్లాలో దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయంగా కీలకంగా ఉన్నప్పటికీ, ప్రజల్లో మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు విశాఖ ఏజెన్సీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదివాసీల ఆగ్రహానికి గురయ్యేలా అయ్యన్న వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇటీవల విశాఖలో నిర్వహించిన పర్యాటక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన్ని తోడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మూడు జిల్లాల కలెక్టర్లు కూడా హాజరయ్యారు. సభలో ఆయన పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అనేక పర్యాటక స్థలాల అభివృద్ధికి అటవీ హక్కుల చట్టం (1/70 యాక్ట్) ఒక ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఈ చట్టాన్ని సడలించాల్సిన అవసరం ఉందని, అది అభివృద్ధికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారిందని, ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే గిరిజనుల పేరుతో పెట్టాల్సి వస్తుందని అన్నారు. అయితే గిరిజనులకు ఆర్థిక స్థోమత తక్కువగా ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఆదివాసీల ఆగ్రహానికి కారణమయ్యాయి. తమ హక్కులను హరించేందుకు అయ్యన్నపాత్రుడు ఎవరని గిరిజన నాయకులు మండిపడుతున్నారు. ఆయన వెంటనే తన మాటలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఈ నెల 12న మన్యం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన రాజకీయ జీవితం మొత్తంలో ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి. ఎప్పుడూ ప్రామాణికంగా, హుందాగా వ్యవహరించే నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం అనవసర వివాదంలో చిక్కుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత పదవీ కాలం తర్వాత రాజకీయాలకు వీడ్కోలు పలకాలని భావిస్తున్న అయ్యన్నపాత్రుడుకి ఇలాంటి వివాదం ఆయనకు మైనస్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాల నుంచి ఆయన ఎలా బయటపడతారన్నది రాజకీయంగా ఆసక్తిగా మారింది.













