విశాఖలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్..!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ అయ్యారు. విశాఖ విమానాశ్రయంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్, ఇతర మంత్రులను గన్నవరం సభలో పరుష పదజాలంతో దూషించారని అయ్యన్నపై ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అయ్యన్నను విజయవాడకు తరలిస్తున్నారు. ఈ ఉదయమే హైదరాబాద్ నుంచి విశాఖ బయల్దేరిన ఆయన 10.05 గంటలకు విశాఖ చేరుకున్నారు. ఇక్కడకు చేరుకున్న పావు గంట తర్వాత విమానాశ్రయం నుంచి ఆయన బయటకు వచ్చారు. తన కారు వద్దకు వెళ్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నను ఇలా బలవంతంగా అరెస్ట్ చేయడంపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.













