నవ నిర్మాణ దీక్షలో మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
నవ నిర్మాణ దీక్షలో ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కొందరు బయట నుంచి వచ్చి విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వాళ్లకు రాజకీయ నేతలు, అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. భూదందాలను అరికట్టేందుకు కలెక్టర్, జేసీ, సీపీ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. కలెక్టర్, జేసీ, సీపీకి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
ప్రజలు, అధికారులు ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆర్అండ్బీ సీఈకి రూ. 140 కోట్ల అక్రమాస్తులా?.. ఓ తహసీల్దార్‌కు రూ. 40 కోట్ల అక్రమ సంపాదనా? రాష్ట్రంలో అసలేం జరుగుతోందన్నట్లుగా మంత్రి మాట్లాడారు. మంత్రి మాటలు విన్న తోటి ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. మంత్రి ఇలా బహిరంగంగా మాట్లాడటమేంటని అందరూ ఆయన వైపు తదేకంగా చూడసాగారు.! విదేశాల్లో కష్టపడి సంపాదించిన సొమ్ముతో భూములు కొనుగోలు చేస్తే.. వాటినీ కొందరు కబ్జా చేస్తున్నారు .. ఇంతకీ వీళ్లు మనుషులా?…పశువులా?అంటూ మంత్రి అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే మంత్రి అయ్యన్న ఈ వ్యాఖ్యలు ఎవర్ని దృష్టిలో ఉంచుకుని అన్నారో తెలియరాలేదు.!













