అటానమస్ కాలేజీలకు జగన్ షాక్!
అటానమస్ కాలేజీల్లో పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్నాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై అన్ని కాలేజీలకూ JNTU ప్రశ్నపత్రాలనే తయారు చేస్తుంది. ప్రశ్నపత్రాల వాల్యూయేషన్ కూడా JNTUనే చేపడుతుంది. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అటానమస్ కాలేజీల్లో విద్యావిధానంపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అటానమస్ కాలేజీలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు తీసివేయడం సంచలన నిర్ణయం అనే చెప్పొచ్చు. పలు కాలేజీలు, యూనివర్సిటీలు తమ పిల్లలకు తామే ప్రశ్నపత్రాలు రూపొందించి పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. దీంతో అటానమస్ కాలేజీల్లో చదివే పిల్లలకు అధిక మార్కులు వస్తున్నాయని.. జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో తక్కువ మార్కులు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్యాప్ ను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం జగన్ ఈ సందర్భంగా సూచించారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేరని.. అందుకు తగ్గట్లు విద్యావిధానం ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికీ నైపుణ్యంతో పాటు సబ్జెక్టు పరిజ్ఞానం ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతికోర్సులో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని స్పష్టం చేశారు. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువేముంటుందని సీఎం ప్రశ్నించారు. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యావిధానాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని సూచించారు. ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్, ఏప్రిల్ 27న వసతిదీవెన నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 10 లక్షలమందికిపైగా విద్యార్థులకు లబ్ధి కలగనుంది. విద్యాదీవెన ద్వారా తల్లిదండ్రుల్లో చదువులకు ఎలాంటి ఇబ్బంది రాదని అధికారులు భరోసా ఇచ్చారు. అందుకే ఈ ఏడాది డిగ్రీలో అడ్మిషన్లు భారీగా పెరిగాయని వివరించారు. మరోవైపు.. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.













