Kinjarapu Atchannaidu: రైతుల యూరియా ఆవేదన పై అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రైతులు యూరియా సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువై, రైతులు ఎరువుల దుకాణాల ముందు రాత్రి పూట కూడా క్యూలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. కొందరు అక్కడే రాత్రి గడుపుతూ, వర్షంకు తడిసినా సరే ఎరువు కోసం వేచి చూస్తున్నారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇప్పటికే రెండు సార్లు సమీక్ష నిర్వహించి, రైతులకు సరైన విధంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరుగుతాయనే అనుమానం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
ఈ తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొంత తేలికగా తీసుకున్నట్టుగా ఆయన మాటలు ఉండడం వివాదాలకు దారి తీసేలా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రివేళ్లలో రైతులు యూరియా కోసం క్యూలో నిలబడుతున్నారన్న వార్తలను ఆయన భోజన బఫేతో పోల్చడం తీవ్ర విమర్శలకు గురైంది. “మనమందరం ఎవరైనా ఇంటికెళ్లి భోజనం చేయాలంటే వడ్డించే వరకు వేచి ఉండాలి. బఫే భోజనంలో కూడా లైన్‌లో నిలబడి తింటాం. ఇదీ అలాగే” అని ఆయన చెప్పడం రైతు సంఘాలను ఆగ్రహానికి గురి చేసింది.
ఉమ్మడి గోదావరి జిల్లాలు (Godavari Districts), కర్నూలు (Kurnool), గుంటూరు (Guntur) ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను బాగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పత్రికల్లో వచ్చిన కథనాలు రైతుల పరిస్థితిని స్పష్టంగా వివరించాయి. రాత్రి పొద్దుపోయినా వారు ఎరువుల దుకాణాల వద్ద కాపులు కాస్తూ, ఆహారం కూడా తినకుండా కష్టపడుతున్నారన్న వాస్తవాలు బయటపడ్డాయి. ఇలాంటి సందర్భంలో మంత్రి చేసిన పోలిక రైతుల మనసుకు గాయం చేసినట్టయింది.
రైతు సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ, ప్రస్తుతం రైతులు ఎంతటి కష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. “ఎరువులు దొరకక..నిద్రాహారాలు మాని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను బఫే భోజనంతో పోల్చడం అవమానం” అని వారు మండిపడుతున్నారు. క్యూలో నిలబడి తీసుకోవడం ఒక్కసారిగా తప్పు కాదేమో కానీ, దాన్ని విందు భోజనంతో పోల్చడం అనవసరం అని విమర్శిస్తున్నారు.
ఇది మాత్రమే కాదు, గతంలో కూడా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల సంక్షేమ పథకాలపై మాట్లాడేటప్పుడు “ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్ముకోవాలి” అన్న ఆయన మాటలు కూడా ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే వైసీపీ (YCP) నాయకులకు చీరలు పంపిస్తానని చెప్పడం కూడా రాజకీయంగా దుమారం రేపింది.
ప్రస్తుతం మాత్రం యూరియా సమస్య అత్యంత సున్నితమైన అంశంగా మారింది. రైతుల కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అటువంటి సమయంలో మంత్రులు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రైతుల సమస్యలను ఎగతాళి చేస్తే, అది ప్రజల్లో ప్రతికూలతను కలిగిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.