Kinjarapu Atchannaidu: అచ్చెన్నాయుడు vs వైసీపీ..ఉచిత బస్సు ప్రయాణంపై రాజకీయ వేడి..
ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఆర్టీసీ (RTC) బస్సు ప్రయాణంపై రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తున్న ఈ పథకం గురించి వైసీపీ (YCP) నాయకులు వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం పూర్తిగా అందడం లేదని, కేవలం కొంతమందికే ఈ సౌకర్యం కలుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా ఏపీ వ్యవసాయశాఖ మంత్రి (AP Agriculture minister ) కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విభిన్న వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా సంతబొమ్మాళి (Santabommali) ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఉచిత బస్ పథకం (Free bus scheme) గురించి అక్కడి మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యం బాగా అందుతోందని, ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతోందని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఈ పథకాన్ని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సమాధానాలతో స్పష్టమైంది ఏమిటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సరైన విధంగానే సాగుతోందని అని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంలో వైసీపీ నేతల ఆరోపణలపై అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ అధికారం కోల్పోవడమే వైసీపీకి భరించలేని బాధగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ప్రతి పథకాన్ని తప్పుపడుతూ, వాస్తవానికి విరుద్ధంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఇకపై వైసీపీ నేతలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితికి పరిష్కారం కోసం తాను నేరుగా సహాయం చేస్తానని అచ్చెన్నాయుడు ప్రకటించారు. “ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం లేదని మీరు నిజంగానే నమ్మితే, నేను మీకు చీరలు పంపిస్తాను. ఎంత మంది నేతలున్నారో చెప్పండి. ఆ సంఖ్య మేరకు నేను నా సొంత ఖర్చుతో చీరలు కొనుగోలు చేసి పంపిస్తాను. మీరు ఆ చీరలు కట్టుకుని బస్సులో ఎక్కండి. అప్పుడు ఉచిత ప్రయాణం జరుగుతోందో లేదో మీకే అర్థమవుతుంది” అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి చేసిన ఈ ప్రకటన వైసీపీపై బలమైన విమర్శగా మారగా, అధికార పక్షం కార్యకర్తలు మాత్రం దీన్ని ఒక సరదా వ్యంగ్యంగా తీసుకుంటున్నారు. మరోవైపు మహిళల కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని వైసీపీ నిరంతరం టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాలలో విమర్శలు ప్రతివిమర్శలు చాలా సహజం, కానీ కొన్నిసార్లు కాస్త హద్దు దాటినట్లు అనిపించే ఇటువంటి విమర్శలు పార్టీపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. గతంలో వైసీపీ చేసిన కామెంట్స్ ను విమర్శించే టీడీపీ నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు అనే వారు కూడా ఉన్నారు. మరి ఈ చర్చలు ఎంతవరకు పోతాయి.. వైసీపీ దీనికి ఎటువంటి రిప్లై ఇస్తుంది అనేది చూడాలి.







