Bangarupalem: జగన్ బంగారుపాళ్యం పర్యటన పై స్పందించిన అచ్చెన్నాయుడు..

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం (Bangarupalem) ప్రాంతంలో జగన్ (Jagan) పర్యటనపై రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ పర్యటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటన వెనుక ముందే ప్లాన్ చేసిన కుట్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
బంగారుపాళ్యంలో జగన్ పర్యటించినప్పుడు జరిగిన ఒక ఘటనకు సంబంధించి, మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ఆయన ప్రకారం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress party) చెందిన మాజీ సర్పంచ్ ప్రకాష్ రెడ్డి (Prakash Reddy)కి ఉన్న మామిడి తోటలో కాయల సమస్య ముందే పరిష్కారమైందని చెప్పారు. కాయలు చాలావరకు కిలో రూ.4కి అమ్మకానికి వెళ్లిపోయాయని ఆయన వివరించారు. కానీ జగన్ పర్యటన సందర్భంగా తోట నుంచి ఐదు ట్రాక్టర్లలో మామిడి కాయలను తీసుకెళ్లి నడిరోడ్డుపై వేసి హంగామా సృష్టించారని ఆరోపించారు. ఇది వ్యవసాయ సమస్యలపై కాకుండా, ప్రభుత్వాన్ని చెడుగా చూపించాలనే ప్రయత్నమని మంత్రి అన్నారు. నిజంగా రైతుల కోసం వచ్చుంటే, రెండు నెలల క్రితమే వచ్చి ఉండేవారని.. కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిన సమయంలో వచ్ఛి ఇలా చేయడాన్ని రాజకీయ ప్రయోజనం కోసమే అని ఆయన అన్నారు.
ఇంకా, ట్రాఫిక్ అడ్డగించిన విధానం, రోడ్డుపై మామిడి కాయలు వేసిన తీరు చూసి, జగన్ ఒక్కసారైనా స్పందించి వారించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. “గతంలో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండిన వ్యక్తి అనుభవం ఏమైంది?” అని వ్యాఖ్యానించారు. హెలిప్యాడ్ వద్ద ప్రభుత్వం 30 మందికి అనుమతి ఇచ్చిందని, కానీ అక్కడ 300 మందికి పైగా వచ్చినట్టు మంత్రి ఆరోపించారు. తర్వాత జరిగిన ర్యాలీలో వేల మందిని వచ్చిన తీరు ప్రజలలో కలవరం రేపిందని చెప్పారు. పోలీసులు, విలేకరులపైనా దాడులు జరగటం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదాలు జరిగేవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్థానంలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి ప్రవర్తనతో ప్రజలకు దుర్మార్గమైన సందేశం ఇస్తున్నారని విమర్శించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రణాళికగా కనిపించిందని పేర్కొన్నారు.