సజ్జల హద్దు దాటుతున్నాడు.. సీఈఓ కి అచ్చెన్నాయుడు ఫిర్యాదు..
ఏపీలో ఎన్నికల వేడి ప్రతి విషయంలో కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్షణం నుంచి ఎక్కడ ఎవరు కోడ్ ని ఉల్లంఘించకుండా సీఈవో ముఖేష్ కుమార్ మీనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురికి నోటీసులు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తన హద్దులు దాటుతున్నారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తూ సజ్జల రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నాడు అంటూ ఏపీ సీఈఓ కి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పదవిలో ఉంటూ ఒక వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా విపక్షాలపై నిందారోపణలు చేస్తూ.. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తున్నారు అని అన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉల్లంఘన కింద సజ్జలపై ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సీఈఓ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.













