ఎన్నికల రూట్ మ్యాప్ రూపకల్పనలో వైసీపీ బిజీబిజీ..!
2014 అసెంబ్లీ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఐదేళ్ల పాలనకు వచ్చే ఎన్నికలు రెఫరెండం లాంటివి. తమ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని వైసీపీ చెప్పుకుంటోంది. కచ్చితంగా ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారని గట్టిగా నమ్ముతోంది. అయినా పార్టీ కేడర్ ను పరుగులు పెట్టిస్తోంది హైకమాండ్. నేతలు నిత్యం ప్రజల్లో ఉండేలా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆయా కార్యక్రమాల పనితీరు, ప్రభావం.. లాంటి అంశాలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తోంది. తాజాగా వైసీపీ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం నిర్వహించింది.
తాడేపల్లిలోని ఓ హోటల్లో 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకు, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించింది వైసీపీ. ఇలా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించేటప్పుడు కచ్చితంగా పార్టీ అధినేత జగన్ పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ సమావేశం పూర్తిగా సజ్జల ఆధ్వర్యంలోనే జరిగింది. పరిశీలకులకు, జిల్లా అధ్యక్షులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన పలు చర్యలను వారికి సూచించారు. ఎన్నికల వరకూ పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలి.. ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలి.. అనే అంశాలపై ఓ బుక్ లెట్ ను రూపొందించింది వైసీపీ. దాన్ని నేతలందరికీ ఇచ్చి దాని మేరకు పనులు చేయాలని ఆదేశించింది.
ముఖ్యంగా ఎన్నికల్లో ఫలితాలను ప్రభావం చేసేది ఓటర్లే. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 21 వరకూ దీనికి అవకాశం ఉంది. బోగస్ ఓటర్లను టీడీపీ జాబితాలో చేర్పించేందుకు ప్రయత్నిస్తోందని.. దాన్ని అడ్డుకుని ఓటరు జాబితా పక్కాగా ఉండేలా వార్డు స్థాయి కార్యకర్తలు కన్నేసి ఉంచాలని సజ్జల సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి జాబితాలో పేరు ఉందా.. లేదా.. వివరాలన్నీ కరెక్టుగా ఉన్నాయా.. లాంటి అంశాలపై ఆరా తీయాలని కోరారు. ఏవైనా అక్రమాలు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దాలని సూచించారు.
మరోవైపు నియోజకవర్గాల వారీగా నేతల పనితీరు ఎలా ఉండాలి.. కొత్తగా పార్టీలో చేరే నేతలతో ఎలా సమన్వయం చేసుకోవాలి.. లాంటి అంశాలపైన కూడా సజ్జల దిశానిర్దేశం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నేతలు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని.. వాళ్లను కలుపుకుపోవాలని సూచించారు. అలాగే నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఎవరైనా ఉంటే వెంటనే గుర్తించి సమస్య సద్దుమణిగేలా చూడాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని.. క్లియర్ కట్ మెజారిటీతో మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామని సజ్జల పార్టీ శ్రేణులకు వివరించారు.













