Vivekananda Reddy: పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి వివేకాహత్య కేసు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy ) హత్య కేసు మళ్లీ కడప (Kadapa) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై, వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత (YS Suneeta) చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన తండ్రి హత్యలో అవినాశ్ రెడ్డి (Avinash Reddy) పేరు వినిపిస్తుందని జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యుడిలా, తమ ఇంట్లో తమతో ఒకడిగా తిరిగే పిల్లాడిలా చూసిన వ్యక్తి ఇంత పెద్ద నేరానికి సంబంధం కలిగి ఉంటాడని కలలో కూడా అనుకోలేదని చెప్పారు.
ఇటీవల సీబీఐ (CBI) ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టు (Supreme Court)లో అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో, సునీత కడప ఎస్పీ అశోక్ కుమార్‌ను కలవడం, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఆరేళ్ల క్రితం జరిగిన హత్య సంఘటనను మళ్లీ గుర్తుచేసిన ఆమె, హత్య జరిగిన తర్వాత అవినాశ్ రెడ్డి తన వద్దకు వచ్చి ఒక లేఖ చూపించి, ఇందులో ఇతరుల పేర్లు ఉన్నాయని, వాళ్లే కారణమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే నిజంగా తన తండ్రి హత్య కేసుకి అవినాష్ కి సంబంధం ఉంటుందని అప్పట్లో ఊహించలేదని వివరించారు.
ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన సమయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పులివెందుల (Pulivendula) మండలంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల వల్ల వాతావరణం వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో సునీత పులివెందుల ప్రాంతంలో అడుగుపెట్టి, ప్రజలతో తన తండ్రి హత్య విషయాన్ని మళ్లీ ప్రస్తావించడం, పరిశీలకుల దృష్టిలో ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అవినాశ్ రెడ్డిని ప్రజా కోర్టులో నిందిస్తూ, ఎన్నికల ముందు ఆయనపై ప్రతికూల వాతావరణం సృష్టించాలనే ప్రయత్నంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వివేకానంద రెడ్డి హత్య తర్వాత సునీత నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్నారు. గతంలో 2024 ఎన్నికల సమయంలో కూడా షర్మిల (YS Sharmila) తో కలిసిన సునీత ఇదే విధంగా జగన్ పై వ్యాఖ్యలు చేశారు. ఓరి ఎక్కంగా జగన్ ఓటమికి అతని కుటుంబ సభ్యుల కారణమయ్యారు అన్న విమర్శ కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది అని కొందరు భావిస్తున్నారు.
సునీత తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతుండగా, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. పులివెందుల ఉప ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ రాజకీయాల మధ్య వ్యక్తిగత విభేదాలు ఇలా బహిర్గతం కావడం తో ఈ పరిణామం పులివెందులలో ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.







