అవినాశ్ రెడ్డిపై వివేకా కూతురు సునీత బరిలో దిగబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఇప్పుడు వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిరుగుతోంది. హూ కిల్డ్ బాబాయ్.. అబ్బాయ్ కిల్డ్ బాబాయ్.. అని టీడీపీ ఒకవైపు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు వివేకా కుమార్తె సునీత ఈ కేసును అస్సలు వదలట్లేదు. పట్టువదలని విక్రమార్కురాలిలా పోరాడుతోంది. అవినాశ్ రెడ్డి కుటుంబానికి ఉచ్చు బిగిసేలా చేసింది. ఇప్పుడు బెయిల్ పిటిషన్ పైన కూడా సునీత ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వెంటాడుతున్నారు. ఇంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో అవినాశ్ రెడ్డి పైన పోటీ చేసేందుకు సునీత సిద్ధమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది.
కడప జిల్లాలో వై.ఎస్.కుటుంబానికి తిరుగులేదు. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఆ కుటుంబీకులదే హవా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వేసిన పునాది అలాంటిది. ఆ తర్వాత జగన్ కూడా గత ఎన్నికల్లో కడప జిల్లాలో తన కుటుంబానికి తిరుగులేదని నిరూపించారు. అయితే వివేకానంద రెడ్డి హత్య ఆ కుటుంబంలో విభేదాలను రోడ్డుకీడ్చింది. ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోయిందని చెప్పొచ్చు. ఒక వైపు సునీత, మరోవైపు షర్మిల-విజయమ్మ వేరుకుంపట్లు పెట్టుకున్నారు. కుటుంబంలో విభేదాల వల్లే వివేకా హత్యకు గురయ్యారని సీబీఐ కూడా చెప్తోంది. రాజకీయ కారణాలతోనే వివేకాను కుటుంబసభ్యులే హతమార్చారనేది సీబీఐ ఆరోపణ. ఈ నెలాఖరులోపు సీబీఐ ఈ కేసును ఓ కొలిక్కి తేబోంది. సీబీఐ ఏం తేల్చుతుందనే విషయాన్ని పక్కన పెడితే దీని వెనుక కుటుంబసభ్యుల ప్రమేయం ఉందనే విషయం ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది.
వై.ఎస్.వివేకాను హతమార్చిన వారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తేల్చి చెప్తున్నారు. ఈ కేసు విచారణ ఇప్పుడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కుటుంబం విచారణ దగ్గర ఆగింది. అవినాశ్ రెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయకుండా అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. వివేకా హత్యపై సునీత ప్రతిక్షణం పోరాడుతున్నారు. కుటుంబసభ్యులే ఈ పని చేశారని తెలుసుకున్న సునీత.. వాళ్లను విడిచిపెట్టకూడదనే పంతంతో పోరాడుతున్నారు. ఈ కేసులో తుది తీర్పు ఎలా వచ్చినా తాను మాత్రం వాళ్ల అంతు చూసే వరకూ వదిలిపెట్టకూడదని సునీత నిర్ణయించుకున్నట్టు సమాచారం.
కడప ఎంపీ సీటుకోసమే తన తండ్రి వివేకాను పొట్టన పెట్టుకున్నారని సునీత భావిస్తున్నారు. అందుకే ఆ సీటు నుంచే తాను బరిలోకి దిగి తండ్రి కోరికను నెరవేర్చాలని సునీత అనుకుంటున్నట్టు తాజా సమాచారం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అవినాశ్ రెడ్డి కడప నుంచి బరిలోకి దిగితే తాను కూడా అక్కడ నుంచి బరిలోకి దిగాలని సునీత భావిస్తున్నారట. అదే జరిగితే ఈ పోరు రసవత్తరంగా మారడం ఖాయం. అయితే సునీత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా.. లేకుంటే టీడీపీ లేదా బీజేపీ తరపున బరిలోకి దిగుతారా.. అనేది తెలియాల్సి ఉంది.













