YS Jagan: జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో (AP Politics) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో 2019-2024 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) ఆయన అరెస్టు అనివార్యమని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులు అరెస్టయిన నేపథ్యంలో, జగన్ అరెస్టు (YS Jagan Arrest) రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏపీఎస్బీసీఎల్ (APSBCL) ద్వారా లిక్కర్ వ్యాపారంలో అవకతవకలు జరిగాయని, దాదాపు రూ. 3,200 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో అక్రమాలు, కిక్‌బ్యాక్‌లు, బ్రాండ్ మానిపులేషన్‌లు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటీ) ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా పేర్కొన్న కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Raj Kesireddy), జగన్ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈయన అరెస్టయ్యారు. ఈ కేసులో జగన్‌కు సన్నిహితులైన పలువురు వ్యక్తులు ఇప్పటికే అరెస్టయ్యారు. జగన్ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారు.
ఎఫ్ఐఆర్‌లో జగన్‌ను నేరుగా నిందితుడిగా పేర్కొనకపోయినా సిట్ రిమాండ్ నివేదికలో ఆయనను కిక్‌బ్యాక్‌ల లబ్ధిదారుగా పేర్కొన్నారు. నివేదిక ప్రకారం డిస్టిలరీల నుంచి 20% కమీషన్ వసూలు చేశారని.. కమిషన్ ఇవ్వని వాళ్లను బెదిరించి సరఫరా ఆర్డర్‌లను నిలిపివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులైన రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వారికి చేరినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలు వైఎస్సార్సీపీ పై రాజకీయ ఒత్తిడిని పెంచుతున్నాయి. జగన్ కు ఈ కేసులో ప్రమేయం లేదని, ఇవి రాజకీయ కక్షలతో కూడిన ఆరోపణలని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు అంతిమంగా సొమ్ము జగన్ కే చేరిందని, త్వరలోనే ఆ విషయాన్నీ బయటికొస్తాయని చెప్తున్నారు. మరోవైపు.. ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇది జగన్‌కు మరిన్ని చిక్కులు తెచ్చే అవకాశం ఉంది. జగన్ అరెస్టు జరిగితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయవచ్చు. వైఎస్సార్సీపీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు.