కేసుల ఊబిలో జగన్ కుటుంబం..! కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా..?
వై.ఎస్.ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఏదో ఒక ఇష్యూ ఆ కుటుంబీకులను ఇబ్బంది పెడుతోంది. ఫ్యామిలీలో అందరిపైనా కేసులు నమోదయ్యాయి. దీంతో కోర్టులు, విచారణ సంస్థల చుట్టూ వై.ఎస్. కుటుంబసభ్యులు తిరుగుతున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ.. ఇలా విచారణ సంస్థలు దాఖలు చేసిన కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. వీటి నుంచి ఎప్పుడు బయటపడతారో తెలియని పరిస్థితి. ఒక దాని నుంచి రిలీఫ్ దొరకగానే ఇంకోదాంట్లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. జగన్, షర్మిల, విజయమ్మ, అవినాశ్ రెడ్డి.. ఇలా అందరిపైనా కేసులు నమోదు కావడం, కోర్టులు చుట్టూ తిరగాల్సి రావడం వాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
వై.ఎస్.వివేకా హత్య కేసు విచారణ.. వారి కుటుంబానికే తగులుకుంటోంది. ఇప్పటివరకూ వందలాది మందిని విచారించిన సీబీఐ.. చివరకు వివేకా హత్యకు వై.ఎస్.కుటుంబీకులే ప్లాన్ చేశారని ఆరోపిస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు చెప్తోంది. దీంతో అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అవినాశ్ రెడ్డిని కూడా రేపోమాపో అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది.
మరోవైపు.. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి హడావుడి చేస్తోంది. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారావిడ. ఈ క్రమంలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని షర్మిల సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా సిట్ కార్యాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకోవడం, వారిపై దురుసుగా ప్రవర్తించడంతో షర్మిలపై కేసు నమోదైంది. షర్మిలకు మద్దతుగా స్టేషన్ కు వచ్చిన తల్లి విజయమ్మ కూడా పోలీసులపై చేయి చేసుకోవడంతో ఆమె పైన కూడా పోలీసులు కేసు పెట్టారు. షర్మిలపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి.
ఇక.. వై.ఎస్.జగన్ అక్రమాస్తుల కేసు ఇప్పటికే విచారణలో ఉంది. ఈడీ దీన్ని విచారిస్తోంది. ఇప్పటికే పదేళ్లు దాటిపోయింది. అయినా ఇది ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఈ కేసు నమోదైంది. ఈ కేసులో స్వయంగా విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఎన్ఐఏ కోర్టు జగన్ ను ఆదేశించింది. అయితే భద్రతాకారణాల రీత్యా తాను స్వయంగా హాజరు కాలేనని జగన్ తెలిపారు. ఇలా ఓవరాల్ గా కుటుంబసభ్యులందరి పైనా వివిధ రకాల కేసులు, వివిధ సంస్థల విచారణలు కొనసాగుతున్నాయి. మరి ఇవన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయో..!













