వై.ఎస్.భాస్కర్ రెడ్డి అరెస్ట్… వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కొంతకాలంగా కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారిస్తోంది. వీళ్లిద్దరినీ అరెస్ట్ చేయడం ఖాయమని చాలాకాలం నుంచే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవాళ పులివెందులలో వై.ఎస్.అవినాశ్ రెడ్డి స్వగృహంలో ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అవినాశ రెడ్డి పీఏ రాఘవ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మరింత పురోగతి లభించనుంది.
ఈ నెలాఖరులోపు వివేకా హత్య కేసు విచారణ ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణాధికారిని కూడా మార్చింది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇవాళ అనూహ్యంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పులివెందులలో అరెస్టు చేయడం సంచలనం కలిగించింది. తెల్లవారుజామునే పులివెందులకు రెండు వాహనాల్లో చేరుకున్నారు సీబీఐ అధికారులు. 5 గంటల 10 నిమిషాలకు అవినాశ్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి దాదాపు 6.20 నిమిషాల వరకూ సోదాలు నిర్వహించారు.
అవినాశ్ ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారని సమాచారం తెలుసుకున్నస్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోకి అనుమతించాలని కోరారు. అయితే సీబీఐ అధికారులు ఎవరినీ అనుమతించలేదు. భాస్కర్ రెడ్డి సోదరుడ్ని కూడా ఆపేశారు. లాయర్లనైనా అనుమతించాలన్న విజ్ఞప్తిని సీబీఐ అధికారులు పట్టించుకోలేదు. చివరకు భాస్కర్ రెడ్డి ఫోన్ ను సీజ్ చేసి.. ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. వై.ఎస్.భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నట్టు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ కు తరలించారు. ఈ సమయంలో వై.ఎస్.అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు.
మరోవైపు అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య సమయంలో సాక్ష్యాధారాలను రాఘవ రెడ్డి చెరిపేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. రెండ్రోజుల క్రితం అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్యకు ముందు ఉదయ్ కుమార్ రెడ్డి అవినాశ్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఈ వారంలోనే ముగ్గురు ప్రధాన వ్యక్తులు వివేకా హత్య కేసులో అరెస్టు కావడం సంచలనం కలిగిస్తోంది. త్వరలోనే అవినాశ్ రెడ్డిని మరో దఫా విచారణకు పిలుస్తారని సమాచారం.













