అవినాశ్ రెడ్డి సాక్షి కాదు.. నిందితుడే..! వివేకా హత్య కేసులో సీబీఐ సంచలనం..!!
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో మలుపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎంతోమందిని విచారించిన అనంతరం ఇప్పుడా కేసు అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. అవినాశ్ రెడ్డి కూడా అరెస్టు ఖాయమనుకుంటున్న సమయంలో ముందస్తు బెయిల్ తో ఆయన బయటపడ్డారు. ఇవాళ కాకుంటే రేపైనా ఆయన అరెస్టు ఖాయమనుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లూ ఆయన్ను సాక్షిగానే విచారిస్తూ వచ్చింది సీబీఐ. కానీ ఇప్పుడు నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ను 8వ నిందితుడిగా చేర్చింది.
వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సీబీఐ తన వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది. హత్యకు కుట్ర పన్నడంతో పాటు సాక్ష్యాలను చెరిపివేయడంలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని వెల్లడించింది. తండ్రీకుమారులిద్దరూ కలిసి దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నారని ఆరోపించింది. కుట్ర, సాక్ష్యాల ధ్వంసంపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోనే అవినాశ్ రెడ్డి హత్యాస్థలానికి చేరుకున్నారని.. అక్కడ అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని పేర్కొంది.
బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. హత్య జరిగినరోజు ఉదయం 5గంటల 20 నిమిషాలకు ముందే గంగిరెడ్డి వాళ్లతో దస్తగిరి మాట్లాడినట్లు వాంగ్మూలం ఇచ్చారని, కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తెలిపారని సీబీఐ వెల్లడించింది. అంతేకాక సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రయత్నించారని తెలిపింది. అంతేకాదు.. హత్య విషయం ఉదయం 6.15కే జగన కు తెలిసని.. అప్పటికి వివేకానంద రెడ్డి పీఏ బయటకు ఈ విషయం చెప్పలేదని స్పష్టం చేసింది.
భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యులు ప్రభావితం అవుతారని.. కడప, పులివెందులలో ప్రభావితం చేయగల వ్యక్తి ఆయన అని సీబీఐ వివరించింది. సాక్ష్యులు, ఆధారాలు ప్రభావితం అయితే ఈ కేసుకు పూడ్చలేని నష్టం జరుగుతుందని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్ రెడ్డి చెప్పడం కూడా అబ్దమని.. ఏప్రిల్ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన బెయిల్ కు అర్హత లభించినట్టు బావించవద్దని కోర్టును సీబీఐ కోరింది. దస్తగిరి విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగానే జరిగిందని.. కడప కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించింది. మరోవైపు వివేకా హత్య జరిగిన తర్వాత రక్తం తుడవక ముందే ఫోటోలు, వీడియోలు తీశారని.. అవి ఉన్నాయి కాబట్టి సాక్ష్యాలకు ఆటంకం లేదన్న వాదన సరికాదని సీబీఐ గుర్తు చేసింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. రేపు తీర్పు వెల్లడించనుంది. అయితే ఈ విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డిని సాక్షిగా కాకుండా నిందితుడిగా పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది.













