వివేకా హత్య రోజు ఏం జరిగిందంటే… సంచలన వీడియో విడుదల చేసిన అవినాశ్ రెడ్డి
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి సీబీఐకి ప్రశ్నల వర్షం కురిపించారు. దర్యాప్తు అంతా ఏకపక్షంగా సాగుతోందని, తాను సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసులో తనను అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. హత్య చేసిన వాళ్లు అప్రూవర్ గా మారడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే తాను వీడియో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు అవినాశ్ రెడ్డి.
వివేకా హత్య కేసు ఏపీలో ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీన్ని జూన్ నెలాఖరులోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. అయితే ఈ మధ్యకాలంలో అనేక ట్విస్టులు ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. హత్య వెనుక కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించడం, కేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరడంతో కేసు మరో మలుపు తిరిగింది. అప్పటివరకూ అవినాశ్ రెడ్డి వైపు దృష్టి పెట్టని సీబీఐ.. కేసు తెలంగాణకు మారిన తర్వాత స్పీడప్ చేసింది. అవినాశ్ రెడ్డి ఫ్యామిలీని విచారించింది. తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. అవసరమైతే అవినాశ్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తామని కోర్టుకు వెల్లడించింది సీబీఐ.
అయితే.. ఈ కేసులో సీబీఐ ఒక యాంగిల్లోనే విచారణ జరుపుతోందని.. తమ వాదనలను పట్టించుకోవట్లేదని అవినాశ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తనను విచారణకు పిలిచిన ప్రతిసారి మీడియాతో మాట్లాడిన అవినాశ్ రెడ్డి.. ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. వివేకా కుమార్తె, అల్లుడు చెప్పిందే నిజమని సీబీఐ నమ్ముతోందని, తాము చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరపట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అవినాశ్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు.
హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు అవినాశ్ రెడ్డి. ఆ రోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో తనకు శివప్రకాశ్ రెడ్డి కాల్ చేశారని.. వివేకం సార్ ఇంటికి వెళ్లాలని చెప్పారని అవినాశ్ రెడ్డి వివరించారు. తాను అప్పటికే పులివెందుల నుంచి జమ్మలమడుగు బయలుదేరానని.. వివేకా చనిపోయారని చెప్పగానే ఆయన ఇంటికి వెళ్లానని చెప్పారు. బాత్రూంలో శవం ఉందని, రూమంతా రక్తం ఉందని.. వెంటనే తాను సీఐకి ఫోన్ చేసి.. ఇక్కడ వివేకా సర్ చనిపోయారని, రూమంతా రక్తం ఉందని.. త్వరగా రావాలని కోరినట్లు వివరించారు. అయితే 6.10లకే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పీఏ కృష్ణా రెడ్డి ఫోన్ చేసి విషయం చెప్పారని ఆయన తెలిపారు. అంతేకాక.. వివేకానంద రెడ్డి రాసిన లేఖ, మొబైల్ ఫోన్ ను దాచిపెట్టాలని రాజశేఖర్ రెడ్డి.. కృష్ణారెడ్డికి చెప్పారన్నారు. తన కంటే ముందు వాళ్లెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అంతేకాక ఆ లేఖలో డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టొద్దని వివేకా కోరారని అవినాశ్ రెడ్డి వివరించారు. ఇప్పుడు ప్రసాద్ చెప్పిందే సునీతమ్మ నమ్ముతున్నారని, తన తండ్రి చెప్పిన మాటలకు విలువలేదా.. అని అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. హత్య చేసిన దస్తగిరి అప్రూవర్ గా మారితే సీబీఐ అంగీకరించడమేంటని అవినాశ్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సీబీఐ ఐఓ రాంసింగ్ ఒకవైపు మాత్రమే విచారమ జరుపుతున్నారని.. తాము ఎన్నిసార్లు విషయం చెప్పినా పట్టించుకోవట్లేదని అవినాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వైఖరి తేడాగా ఉందన్నారు. ఎవరిని కాపాడడం కోసం ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. సునీతమ్మ కూడా ముందు ఇచ్చిన స్టేట్ మెంట్ ఒకలా ఉందని, ఆ తర్వాత మరో మాట మాట్లాడారని చెప్పారు. సీబీఐ కూడా వాళ్లకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. వాళ్లు ఎన్నిసార్లయినా స్టేట్ మెంట్లు మార్చుకునే వీలు కల్పించిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కేసు మరోలా ముందుకెళ్తోందని అవినాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.













