అవినాశ్ రెడ్డికి దక్కని ఊరట.. బెయిల్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేమన్న హైకోర్ట్
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై ఇప్పటికిప్పుడు వాదనలు విని తీర్పు ఇచ్చే పరిస్థితి లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున తదుపరి విచారణను జూన్ ఐదుకు వాయిదా వేసింది. అత్యవసరం అనుకుంటే వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని సూచించింది. దీంతో అవినాశ్ రెడ్డిపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేసే అవకాశం ఉందని.. అలా జరగకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వై.ఎస్.అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 25 వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అవినాశ్ రెడ్డికి సీబీఐ రాతపూర్వకంగా ప్రశ్నలివ్వాలనడం, వీడియో రికార్డు చేయాలనడం.. లాంటి ఆదేశాలపై సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. అలాంటి ఉత్తర్వులు సరికాదని స్పష్టం చేసింది. అలాంటి ఉత్తర్వులు చెల్లవని, సీబీఐ విచారణ కొనసాగించవచ్చని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పై హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది.
బెయిల్ పిటిషన్ మళ్లీ మొదటికి రావడంతో హైకోర్టులో 25 నుంచి రోజువారీ వాదనలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ వాయిదా పడుతూనే వచ్చింది. ఇవాళ కూడా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని.. కనీసం కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని అతని తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే.. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని.. కాబట్టి దీనిపై అత్యవసర నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఇరుపక్షాల వాదనలు విని తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేసింది.
అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని అటు సుప్రీంకోర్టు కానీ, ఇటు హైకోర్టు కానీ చెప్పలేదు. కఠిన చర్యలు తీసుకోవద్దన్న గడువు కూడా 25తో ముగిసింది. ఇప్పుడు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐకి అవకాశం ఉంది. అవసరమైతే అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తామని గతంలోనే హైకోర్టుకు చెప్పింది సీబీఐ. ఇప్పుడు బెయిల్ పిటిషన్ నెలకు పైగా వాయిదా పడడంతో అంతకాలం పాటు సీబీఐ వేచి చూస్తుందా అనేది డౌటే. ఎందుకంటే జూన్ నెలాఖరులోపు ఈ కేసును క్లోజ్ చేయాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. కాబట్టి ఇప్పుడు సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













