వైసీపీలో కోవర్టులున్నారా..? సొంత పార్టీ నేతలనే ఓడించారా..?
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఓడిపోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రత్యేకంగా ఫలానా కారణం వల్ల వైసీపీ ఓడిపోయిందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పార్టీకి వచ్చిన సీట్లు అంత దారుణంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆ పార్టీ ఓటమికి అనేక కారణాలు ప్రభావం చూపించాయని మాత్రం అర్థమవుతోంది. అయితే సొంతపార్టీలోని కొంతమంది నేతలు పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేశారనే వార్తలు ఇటీవలికాలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ సొంత పార్టీ నేతలపై నోరు తెరవని కొంతమంది నేతలు ఇప్పుడు బహిరంగంగానే పేర్లు చెప్పి మరీ మాట్లాడుతున్నారు. ఇదిప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టైమ్ బాలేదు. అసలే ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేతలపై ఆరోపణలు వాళ్లను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. విజయసాయి రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఆయనకు పార్టీలో అండగా నిలిచే వాళ్లే లేకుండా పోయారు. దీంతో ఆయన ఒక్కడే మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన పలు కీలక కామెంట్స్ చేశారు. పార్టీలోనే ఉంటూ కొంతమంది తనపై కుట్రలు చేసినట్లు ఆరోపించారు. ఇది సంచలనం కలిగించింది. విజయసాయి రెడ్డిపై ఇంత పెద్ద కుట్ర చేసిందెవరని ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఇక ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ సొంత పార్టీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. పార్టీలో కొంతమంది నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. అలాంటి వాళ్లను వదిలిపెట్టే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇదే తరహా మాటలు మాట్లాడారు. చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నాని గెలవడానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డే కారణమని ఆయన ఏకంగా పేర్లతో సహా బయటపెట్టారు. పులివర్తి నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మధ్య స్నేహం ఎలాంటిదో జిల్లాలో అందరికీ తెలుసన్నారు.
పులివర్తి నానిపైన కోపంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు చుట్టుకున్నాయి. అయితే చెవిరెడ్డి కావాలనే పెద్దిరెడ్డి పేరు చెప్పినట్లు సమాచారం. జిల్లాలో తనను ఓడించేందుకు పెద్దిరెడ్డి తెరవెనుక ప్రయత్నించారనే కోపం చెవిరెడ్డికి ఉంది. చెవిరెడ్డికి జగన్ ప్రయారిటీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి ఇలా చేశారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. ఆ మధ్య రోజా, నారాయణ స్వామి కూడా పెద్దిరెడ్డిపై ఇదే తరహా ఆరోపణలు చేశారు. మొత్తానికి జిల్లాలో వైసీపీ ఓటమికి పెద్దిరెడ్డి కూడా తెరవెనుక గట్టిగానే ట్రై చేశారని ఆ పార్టీ నేతలే ఇప్పుడు చెప్పుకుంటూ ఉండడం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.













