మూడు రాజధానులపై వైసీపీలో గందరగోళం..!
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరాలనే పట్టుదల ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి ఉంది. తమడి మూడు రాజధానుల నినాదమేనని ప్రతిసారీ తేల్చి చెప్తోంది. తద్వారా విపక్షాలను ఇరుకున పెట్టాలనేది వైసీపీ ప్లాన్. అయితే అడపాదడపా ఆ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ .. ఆ పార్టీనే ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన కామెంట్స్ వైసీపీలో తీవ్ర దుమారమే రేపుతున్నాయి.
విభజిత ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా అమరావతికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. 2019లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు అమరావతిని కాదని మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై బిల్లు కూడా పాస్ చేసుకుంది. అయితే దీనిపై అమరావతికి భూములిచ్చిన రైతులు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించి తీర్పు చెప్పింది. దీంతో తమ మూడు రాజధానుల బిల్లును వాపస్ తీసుకుంటున్నట్టు జగన్ సర్కార్ హైకోర్టుకు సూచించింది. కొంతకాలంపాటు ఈ అంశాన్ని పక్కనపెట్టింది. దీంతో అమరావతే రాజధాని అని అందరూ అనుకున్నారు. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ సర్కార్. దీంతో తమది మూడు రాజధానుల విధానమేనని మరోసారి తేల్చి చెప్పింది.
విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనేది వైసీపీ ఆలోచన. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. అయితే తాజాగా ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ విశాఖ త్వరలో రాజధాని కాబోతోందని ప్రకటించారు. తాను కూడా త్వరలోనే అక్కడికి మకాం మార్చబోతున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత బెంగళూరులో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన మిస్ కమ్యూనికేషన్ అన్నారు. విశాఖే ఏకైక రాజధాని అని ప్రకటించారు. దీంతో విపక్షాలు ఆరోపిస్తున్నట్టే మూడు రాజధానులు ఉండవని.. విశాఖే ఏకైక రాజధానిగా ఉండబోతోందని భావిస్తున్నారు.
అయితే ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు తదితరులు తమది మూడు రాజధానుల విధానమేనని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ నేతల్లో ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొందరేమో విశాఖే రాజధాని అంటున్నారు. మరికొందరేమో మూడు రాజధానులు అంటున్నారు. దీంతో కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే అసలు రాజధాని అంశం కోర్టులో ఉన్న సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం తప్పంటున్నాయి విపక్షాలు. మొత్తానికి ఏపీలో రాజధాని అంశంపై అధికార పార్టీలోనే తీవ్ర గందరగోళం నెలకొందని చెప్పొచ్చు.













