Volunteers : వాలంటీర్ వ్యవస్థకు వైసీపీ మంగళం..!?

వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఇటీవలి కాలంలో జగన్ 2.0 అనే నినాదంతో కొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 Elections) ఘోర పరాజయం తర్వాత, పార్టీని బలోపేతం చేయడానికి, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వాలంటీర్ వ్యవస్థకు ఇచ్చిన అగ్రస్థానాన్ని.. ఇప్పుడు కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నారు. అయితే, ఈ మార్పు వైసీపీ (YCP) శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.
2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను (volunteers system) ఒక వినూత్న రాజకీయ ఆయుధంగా ఉపయోగించింది. ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వ్యవస్థ కారణంగా పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యారని, ఫలితంగా 2024 ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని జగన్ స్వయంగా అంగీకరించారు. ప్రజల కోసం తాపత్రయం పడ్డాను, కానీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు, జగన్ 2.0లో కేడర్‌కు అగ్రతాంబూలం ఇస్తామని, వారిని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని హామీ ఇచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, వాలంటీర్ వ్యవస్థ ప్రజలతో నేరుగా సంబంధం కలిగి, సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించింది. అయితే, ఎన్నికల ఓటమి తర్వాత, ఈ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యకర్తల కంటే వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఓటమి జరిగిందని జగన్ స్వయంగా అంగీకరించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు చేసిన ఆరోపణల్లో, వాటిని వాలంటీర్లు చేశారని సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargav Reddy) వివరణ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో, వైసీపీ నాయకత్వం నెపాన్ని వాలంటీర్లపై నెట్టివేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడింది. జగన్ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను రెన్యూవల్ చేయలేదని, ఇప్పుడు తాము ఏమీ చేయలేమని కూటమి ప్రభుత్వం చెప్తోంది. వాస్తవానికి ఇది వైసీపీకి ఆయుధం లాంటిది. దీన్ని గట్టిగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవచ్చు. కానీ వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థకోసం పట్టుబట్టి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. వాలంటీర్ వ్యవస్థను లైట్ తీసుకోవడమే ఇందుకు కారణం.
వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం నుంచి అక్రమ కేసుల భయం ఎదుర్కొంటున్నారు. జగన్‌పై మద్యం కుంభకోణం కేసులో అరెస్టు ఊహాగానాలు కూడా ఉన్నాయి. పార్టీ నుంచి కీలక నాయకులు వైసీపీని వీడుతున్నారు. ఇది జగన్‌కు మరో సవాల్‌గా మారింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థకోసం పోరాడి కొత్త సమస్యలు కొనితెచ్చుకోవడం ఎందుకనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. పైగా వాలంటీర్ల వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. వాళ్లకు తగిన గుర్తంపు లభించలేదు. అందుకే వాలంటీర్లను వదిలేసి కార్యకర్తలను నమ్ముకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.