మళ్లీ మొదటికొచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం..! క్రెడిట్ గేమ్ వల్లేనా..?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మలుపులు తీసుకుంటూనే ఉంది. ప్రేవేటీకరణ ఆలోచన లేదని.. బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నిన్న కేంద్ర మంత్రి ప్రకటించారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆయన మాట మార్చారు. దీంతో కార్మికుల ఆశలు కాసేపటికే ఆవిరయ్యాయి. అయితే కేంద్ర మంత్రి ఎందుకు మాట మార్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు తమ వల్లే ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గిందంటూ బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటోంది. దీనిపై వైసీపీ నేతల నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చాలా రోజులుగా నానుతోంది. దీన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు మూడేళ్లుగా ఉద్యమిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము ఉద్యమిస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు – తెలుగోడి హక్కు అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. ఒకవేళ ప్రైవేటీకరణకు ముందుకెళ్తే సింగరేణి ద్వారా బిడ్ వేసి దక్కించుకుంటామన్నారు. దీంతో కార్మికులకు కాస్త ఊరట లభించింది. ఏపీలోని పార్టీలు గట్టిగా ప్రశ్నించకపోవడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమనుకున్నారు. అయితే కేసీఆర్ జోక్యంతో దీనికి కచ్చితంగా బ్రేక్ పడుతుందని ఆశించారు.
ఇంతలోనే విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ .. ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని, RINLను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దీనిపై కార్మికులతో చర్చిస్తామన్నారు. మంత్రి అలా ప్రకటించగానే కార్మికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున మీడియా ముందుకొచ్చి అదీ కేసీఆర్ దెబ్బ.. తమ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది.. అని ప్రకటనలు గుప్పించారు. అయితే ఈ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ కు వెళ్తోందనుకున్నారో ఏమో.. వెంటనే మంత్రి మాట మార్చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకునే కెపాసిటీ తన పరిధిలో లేదన్నారు. అది కేంద్ర కేబినెట్ నిర్ణయమన్నారు. దీంతో గంటల వ్యవధిలోనే కార్మికుల ఆశలు ఆవిరయ్యాయి.
అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గడానికి తామే కారణమని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. తాము టేకప్ చేయడం వల్లే మోదీ సర్కార్ భయపడిందని చెప్పుకొచ్చింది. దీనిపై వైసీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు ప్రైవేటీకరణ ఆపాలని మొదట కోరింది మా సీఎం జగనేనని.. బీఆర్ఎస్ నేతలు మాటలు తగ్గించుకోవాలని సూచించారు. దీంతో ఆ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.













