మీడియా రంగంలోకి విజయసాయి రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ దుష్టచతుష్టం పేరుతో నిత్యం మీడియాను నిందిస్తూ ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. లాంటి సంస్థలను అధికార వైసీపీ నేతలు తప్పుబడుతూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయంటూ మండిపడుతుంటారు. వీటిని బహిష్కరించాలని పిలుపునిస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ పత్రికలు, చానళ్లు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటున్నాయి. ముఖ్యంగా దసపల్లా భూముల వ్యవహారాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. విశాఖలో భూముల కొనుగోలులో గోల్ మాల్ జరిగిందని ఇటీవల బ్యానర్ వార్తను ప్రచురించింది.
విశాఖలో భూముల కొనుగోలులో విజయసాయి రెడ్డి కుమార్తెకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రముఖపాత్ర పోషించిందని ఈనాడు ప్రస్తావించింది. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ఎంతోకాలంగా వ్యాపారాలున్నాయని.. అందులో భాగంగానే భూములు కొనుగోలు చేశారని చెప్పారు. ఇప్పుడు ఇదే అంశంపై విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈనాడు పత్రిక అసత్యాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. విశాఖలో తనకు ఒక ఫ్లాట్ తప్ప మరే ఆస్తులూ లేవని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
విశాఖను రాజధాని కాకుండా అడ్డుకునేందుకే వైసీపీ వ్యతిరేక మీడియా ప్రయత్నిస్తోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. తద్వారా ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో కొనుగోలు చేసిన భూముల ద్వారా లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యంతోనే విశాఖను రాజధాని కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంచేందుకు కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దసపల్లా భూములకు సంబంధించి ఇప్పటికే బిల్డర్లు సమాధానం ఇచ్చారని వివరించారు విజయసాయి రెడ్డి.
మీడియా సమావేశంలో రామోజీరావుపై విజయసాయి రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రామోజీ అంటే గౌరవం ఇచ్చినట్లవుతుందని.. ఆయన్ను గౌరవించేంత స్థాయి లేదన్నారు. అందుకే రాము అని పిలుస్తున్నట్టు చెప్పారు. తనకు మీడియా ఉంది కాబట్టే అసత్యాలతో తమపై ఆరోపణలు చేస్తున్నారన్న విజయ సాయి రెడ్డి.. త్వరలో తాను కూడా ఒక చానల్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. అప్పుడు ఎవరేంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
అరబిందో కుటుంబానికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశానని విజయసాయి రెడ్డి చెప్పారు. వాళ్లు సంపాదించిన ఆస్తులు తనకు ఎలా చెందుతాయని ప్రశ్నించారు. బ్రాహ్మణి ఆస్తులు బాలకృష్ణకు చెందుతాయా.. అని అడిగారు. శైలజ కిరణ్ ఆస్తులు.. ఉప్పలపాటి సుందరరావుకు చెందుతాయా.. అని నిలదీశారు. తన ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానన్న విజయసాయి రెడ్డి.. తన ఆస్తులపై విచారణకు సిద్ధమా అని రామోజీరావును ప్రశ్నించారు. మొత్తంగా ఏపీలో అధికార పార్టీ నేతలకు, ఓ వర్గం మీడియాకు మధ్య వార్ మరో స్థాయికి చేరుతోందని చెప్పొచ్చు.













