లోకేశ్‌తో వంగవీటి రాధా భేటీ.. ఊహాగానాలకు చెక్?
వంగవీటి రాధా పేరు కొంతకాలంగా బలంగా వినిపిస్తోంది. ఆయన పార్టీ మారుతారని.. త్వరలోనే జనసేనలో చేరడం ఖాయమని చెప్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఆయన నారా లోకేశ్ ను కలుస్తుండడం ప్రాధాన్యం కలిగిస్తోంది. ఈ కలయిక ద్వారా తనపై వస్తున్న ఊహాగానాలకు వంగవీటి రాధా చెక్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
వంగవీటి రాధా ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో సాగుతోంది. కలికిరి సమీపంలో ఉన్న నారా లోకేశ్ ను వంగవీటి రాధా వెళ్లి కలుస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాధా అనుచరులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తన రాజకీయ భవిష్యత్తుపైన కూడా రాధా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు కేటాయించబోయే సీటు, కాపుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారిరువురు చర్చిస్తారని సమాచారం. లోకేశ్ తో భేటీ తర్వాత వంగవీటి రాధా అనుమానాలన్నీ తొలగిపోతాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
వంగవీటి రాధా ఇటీవల జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ కూడా రాధాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని అందరూ భావించారు. అంతేకాక వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఇటీవల వంగవీటి రాధాతో చర్చలు జరిపారు. టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఖాయమని ప్రచారం సాగుతున్న సమయంలో రాధా చేరిక హాట్ టాపిక్ గా మారింది. అయితే రాధా మాత్రం తాను టీడీపీని వీడుతున్నాననడంలో వాస్తవం లేదని ప్రకటించారు. దీంతో ఊహాగానాలకు చెక్ పడింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం అటు టీడీపీని, ఇటు వంగవీటి రాధా అనుచరులను వెంటాడుతూ ఉండేది. దానికి ఇవాళ చెక్ పడబోతున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో వంగవీటి రాధాను విస్తృతంగా వాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. కాపులకు వంగవీటి కుటుంబాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా భావిస్తుంటారు. కాపు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని.. ప్రస్తుత జగన్ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా కాపులకు అన్యాయం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని వంగవీటి రాధా ద్వారా కాపులందరికీ చేరవేసేలా టీడీపీ వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికల్లో తమకు దూరమైన కాపులను ఈసారి దగ్గరకు చేర్చుకుంటే తమదే విజయమనీ టీడీపీ గట్టిగా నమ్ముతోంది. అందుకే బలమైన కాపు నేతలను సమర్థంగా వాడుకోవాలనుకుంటోంది.













