50 ప్లస్‌లో పెళ్లి పీటలెక్కబోతున్న వంగవీటి రాధ!
వంగవీటి రంగా వారసుడిగా వంగవీటి రాధా కృష్ణ తెలియని వారెవరూ ఉండరు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాధ. అప్పుడాయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు. అయితే ఆయన త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.
వంగవీటి రాధాకృష్ణ 1968లో జన్మించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆయన దానికే అంకితమైపోయారు. తండ్రి వంగవీటి మరణానంతరం.. ఆయన చరిష్మాను క్యారీ చేయాల్సిన బాధ్యత రాధాపై పడింది. అందుకే ఆయన వ్యక్తిగత జీవితాన్ని సైతం పట్టించుకోకుండా తమను నమ్ముకున్న అనుచరుల కోసం పాటుపడుతూ వస్తున్నారు. కాపు నేత అంటే మొదట గుర్తొచ్చేది రంగాయే. ఇప్పటికీ రంగా పేరు చెప్తే లక్షలాదిగా తరలివచ్చే అభిమానగణం ఉంది. ఆంధ్రాలో కాపులకు ప్రాతినిధ్యం వహించే కుటుంబాల్లో వంగవీటి ఫ్యామిలి అందరికంటే ముందుంటుంది.
వంగవీటి రాధా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మాజీ జడ్పీ ఛైర్మన్ బాబ్జీ, అమ్మాణి కుమార్తె పుష్పవల్లితో రాధా పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో వాళ్ల ఎంగేజ్ మెంట్ జరగనుంది. అనంతరం వచ్చే నెల 6న విజయవాడలో ఘనంగా పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అయితే వంగవీటి అనుచరులు మాత్రం ఇది నిజమేనని నిర్ధారించారు. పుష్పవల్లి తన మిత్రుడి దగ్గర బంధువని తెలుస్తోంది. వంగవీటి రాధ పెళ్లి విషయం తెలియగానే ఆయన అభిమానులు, అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.













