వికేంద్రీకరణ కోసం జేఏసీ రెడీ.. రాజీనామాలకు సిద్ధమైన ఉత్తరాంధ్ర వైసీపీ ప్రజాప్రతినిధులు!
మూడు రాజధానులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం మొదలవుతోంది. అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన ఈ జేఏసీ ఆధ్వర్యంలో పని చేసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. విశాఖను రాజధానిగా చేసేంతవరకూ ఉద్యమం ఆగదని ప్రకటించారు. ఓ వైపు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ ఏర్పాటు కావడం ఆసక్తి కలిగిస్తోంది.
అమరావతి రాజధానిగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ బిల్లు కూడా తీసుకొచ్చింది. అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టింది. దీనిపై పలువురు కోర్టుకు వెళ్లడంతో పలుమార్లు విచారణ కూడా జరిగింది. ఇదే సమయంలో అమరావతికి మద్దతుగా హైకోర్టు ఆదేశాలివ్వడంతో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మూడు రాజధానుల అంశం మరుగున పడిందని భావించారు. అయితే మూడు రాజధానుల అంశంపై వెనక్కు తగ్గేది లేదని త్వరలోనే అధికార వికేంద్రీకరణ ఖాయమని అధికార పార్టీ నేతలు చెప్తూ వచ్చారు.
వైసీపీ సర్కార్ మాడు రాజధానులపై వెనక్కు తగ్గకపోవడంతో అమరావతి రైతులు మరో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో అమరావతి నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేపట్టిన అమరావతి రైతులు.. ఇప్పుడు అమరావతి నుంచి అరసవిల్లి వరకూ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఈ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అమరావతి రైతులు యాత్ర చేపట్టింది మొదలు ఉత్తరాంధ్ర నేతలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనీయబోమని.. యాత్ర చేస్తున్నది రైతులు కాదని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులని విమర్శించారు. అయితే అమరావతి రైతులు కూడా వెనక్కు తగ్గట్లేదు.
అమరావతి రైతుల పాదయాత్ర త్వరలోనే ఉత్తరాంధ్రలో అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. అందులో భాగంగా ఇవాళ విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ హనుమంతు లజపతిరాయ్ ఈ జేఏసీకి కన్వీనర్ గా నియమితులయ్యారు. ఇందులో పలువురు వైద్యులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, న్యాయవాదులు భాగస్వాములయ్యారు.
గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో అన్ని పక్షాలూ ఏకం కావాలనే లక్ష్యంతో ఇలాంటి జేఏసీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో జేఏసీ నేతృత్వంలో ఉద్యమాన్ని చేపట్టాలనుకుంటున్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో మంత్రి అమరనాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. తదితరులు పాల్గొన్నారు. కరణం ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ కూడా జేఏసీ నేతలకు అందించారు. టీడీపీ శాసనసభా పక్ష నేత అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాము కూడా రాజీనామాకు సిద్ధమని మంత్రి అమర్ నాథ్, మాజీ మంత్రి అవంతి ప్రకటించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని జేఏసీ నిర్వహించింది. అలాగే ఈ నెల 15న భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది.
అయితే అధికార పార్టీ నేతలు వికేంద్రీకరణ పేరుతో విశాఖను దోచుకునేందుకే జేఏసీ ఏర్పాటు చేసినట్లు ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ నేతలు విమర్శించడం అంటే వారి భూత్యాగాలను అవమానించడమేనన్నారు యనమల రామకృష్ణుడు. మూడేళ్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోని వైసీపీ ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో డ్రామా ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతిచ్చి.. ఇప్పుడు వ్యతిరేకించడం మోసం చేయడమేనన్నారు. మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజధాని పోరు మరో స్థాయికి వెళ్లింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో జేఏసీ ఏర్పాటు కావడం మరింత ఆజ్యం పోసినట్లయింది.













