Ursa Clusters: ఎవరిదీ ఉర్సా క్లస్టర్స్..? భూముల కేటాయింపు వెనుక గోల్‌మాల్ జరిగిందా..?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (Vizag) ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Ursa clusters pvt ltd) అనే సంస్థకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కేటాయించడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ సంస్థకు 59.86 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 3.5 ఎకరాలు ఐటీ హిల్-3 వద్ద, 56.36 ఎకరాలు కాపులప్పాడలో కేటాయించేందుకు అంగీకరించింది. ఈ భూముల విలువ దాదాపు రూ.3వేల కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ఈ కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, సంస్థ నేపథ్యం గురించి స్పష్టత లేకపోవడం విమర్శలకు కారణమైంది. ఊర్సా క్లస్టర్స్ సంస్థ అధికార తెలుగుదేశం పార్టీ (TDP) నేతల బినామీ సంస్థ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆరోపిస్తోంది.
ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని (Hyderabad( కొత్తగూడలో (Kothaguda) ఒక 3BHK ఫ్లాట్‌లో రిజిస్టర్ అయింది. రూ.10 లక్షల పెట్టుబడితో స్థాపించబడిన ఈ సంస్థకు ఇప్పటివరకు వెబ్‌సైట్ లేదు.. ఆపీస్ లేదు.. ఉద్యోగుల సమాచారం లేదు. రిజిస్ట్రేషన్ అడ్రస్‌లో కూడా వాణిజ్య కార్యకలాపాల ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇలాంటి సంస్థ డేటా సెంటర్ (Data Centre) నిర్మాణం కోసం రూ.5,728 కోట్ల పెట్టుబడి పెడుతుందని ప్రభుత్వం ప్రకటించడం అనుమానాలు రేకెత్తించింది. వైసీపీ నేతలు ఈ సంస్థను సూట్‌కేస్ కంపెనీగా అభివర్ణిస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఊరూ పేరూ లేని కంపెనీకి కోట్ల విలువైన భూములను ఎలా కేటాయిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలపై అధికారికంగా స్పందించలేదు. అయితే కేబినెట్ అప్రూవల్ సమయంలో ఈ భూముల కేటాయింపుపై వివరణ ఇచ్చింది. ఉర్సా క్లస్టర్స్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డేటా సెంటర్ సంస్థగా పేర్కొంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ కోసం రూ. 5,728 కోట్ల పెట్టుబడి పెడుతుందని తెలిపింది. దీని ద్వారా 2,500 ఉద్యోగాలు వస్తాయని వివరించింది. అయితే సంస్థ రిజిస్ట్రేషన్ తేదీ, దాని కార్యకలాపాలపై సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలను పెంచుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ఉర్సా క్లస్టర్స్‌తో హైదరాబాద్‌లో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ స్థాపన కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కూడా ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొంటోంది.
ఉర్సాకు భూముల కేటాయింపులో పారదర్శకత లేదని అర్థమవుతోంది. గతంలో రామానాయుడు స్టూడియోకు (Ramanaidu Studio) కేటాయించిన భూములను రద్దు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఊర్సా క్లస్టర్స్ విషయంలో సమర్థనీయమైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది. ఈ సంస్థ నిజంగా డేటా సెంటర్ నిర్మాణం కోసం సామర్థ్యం కలిగి ఉందా, లేక బినామీ సంస్థగా భూముల స్వాధీనానికి కుట్ర చేస్తోందా అనే ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు అవసరం. గత ప్రభుత్వంలో కొన్ని సంస్థలకు ఇలాగే భూములు కేటాయించి విమర్శలపాలైంది. చివరకు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు టీడీపీ కూడా అలాంటి పనులే చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఉర్సా క్లస్టర్స్ కు కేటాయించిన భూములపై పునరాలోచించాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.