టీడీపీలో ఉండవల్లి శ్రీదేవి చిచ్చు..!?
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపోమాపో తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఇప్పటికే ఆమె చంద్రబాబు, లోకేశ్ ను కలిసి లైన్ క్లియర్ చేసుకున్నారు. అధికార పార్టీ నుంచి బయటికొచ్చి చాలా కాలమైనా.. ఇన్నాళ్లూ ఆమె స్తబ్దుగా ఉండిపోయారు. నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేదు. అయితే చంద్రబాబును కలిసిన అనంతరం ఆమె స్పీడ్ పెంచారు. వెంటనే లోకేశ్ యువగళం పాదయాత్రలో తానే సమన్వయకర్తగా నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. దీంతో ఆమె టీడీపీలో చేరడం ఖాయమైపోయిందని అర్థమవుతోంది. అయితే ఉండవల్లి శ్రీదేవి చేరిక టీడీపీలో పలు సంచలనాలకు కారణమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాడికొండ నుంచి తొలిసారి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు ఉండవల్లి శ్రీదేవి. తన గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటోందంటూ అసెంబ్లీలో ప్రకటించి వార్తల్లో నిలిచారు. అధికార పార్టీలో మంత్రి పదవి ఆశించిన శ్రీదేవికి ఆ కోరిక నెరవేరలేదు. దీంతో ఆమె అసంతృప్తితో ఉండిపోయారు. అదే సమయంలో ఆమెపై కొన్ని అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీలో ఆమెకు ప్రయారిటీ తగ్గిపోయింది. జగన్ కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె అసంతృప్తితో రగిలిపోయారు. సమయానికి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో తమ పార్టీ అభ్యర్థికి కాకుండా టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. ఓటమికి ఉండవల్లి శ్రీదేవి కారణమని వైసీపీ క్లారిటీకి వచ్చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం హైదరాబాద్ వచ్చేసిన ఉండవల్లి శ్రీదేవి ఆ తర్వాత నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తుండగా.. అక్కడికెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజే తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను కలిశారు. అంతేకాక.. ఆరోజు సమావేశానికి తానే సమన్వయకర్తగా వ్యవహరించారు. తన వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రకటించారు. దీంతో శ్రీదేవి టీడీపీలో చేరడం లాంఛనమైపోయింది.
అయితే శ్రీదేవి టీడీపీలో చేరితే ఇన్నాళ్లూ అక్కడ పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పరిస్థితి ఏంటనేది ఆసక్తి కలిగిస్తోంది. తాడికొండ టికెట్ శ్రీదేవికి ఇస్తే శ్రవణ్ కుమార్ ను ఎక్కడ సర్దుబాటు చేస్తారో తెలియట్లేదు. ప్రత్తిపాడు, తాడికొండ ఇక్కడ ఎస్సీ నియోజకవర్గాలు. అలాగే బాపట్ల పార్లమెంటు స్థానం కూడా రిజర్వ్ స్థానమే. ఈ మూడింటిలో వీళ్లిద్దరినీ అకామడేట్ చేయాల్సి ఉంటుంది. తాడికొండ నుంచి శ్రీదేవినే బరిలోకి దింపి అమరావతికి అనుకూలంగా ప్రచారం చేయిస్తే వైసీపీకి ఇబ్బంది తప్పదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. తాను జగన్ మాటలు విని అమరావతికి వ్యతిరేకంగా పని చేశానని శ్రీదేవి చెప్తే అది వైసీపీకి మైనస్ గా మారుతుంది. ఆ స్ట్రాటజీ అమలు చేయాలనుకుంటే శ్రీదేవిని తాడికొండలోనే బరిలోకి దింపుతారు. బాపట్ల నుంచి పార్లమెంటు శ్రవణ్ కుమార్ ను నిలిపే అవకాశం ఉంది. మొత్తానికి శ్రీదేవి చేరిక టీడీపీలో పలు సంచలనాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.













