Thammineni Sitaram : జగన్కు షాక్ ఇవ్వబోతున్న తమ్మినేని సీతారాం..!?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓడిపోయినప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. జిల్లాల్లో కేడర్ కూడా అంత యాక్టివ్ గా కనిపించట్లేదు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే నమ్ముకున్న నేతలే ఆయన్ను కాదని వెళ్లిపోతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మోపిదేవి వెంకటరణ, బీద మస్తాన్ రావు, కిలారి రోశయ్య, సామినేని ఉదయ భాను.. తాజాగా ఇంతియాజ్ తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఇదే కోవలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తమ్మినేని సీతారాం (Thammineni Sitaram) శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు (Amudala Valasa) చెందిన సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ (TDP) ఆవిర్భావం సమయంలో ఆయన పార్టీలో చేరారు. ఐదు సార్లు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 9 ఏళ్లపాటు ఆయన చంద్రబాబు (Chandrababu) కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. 2009లో ఆయన టీడీపీని వీడి ప్రజారాజ్యం (Prajarajyam Party) పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ టీడీపీ గూటికి చేరారు. అయితే విభజనకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో టీడీపీని వీడి 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YCP) చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
అయితే 2019 ఎన్నికల్లో మాత్రం తమ్మినేని సీతారాం ఆముదాల వలస నుంచి గెలిచారు. దీంతో ఆయనకు స్పీకర్ (Speaker) పదవి అప్పగించారు జగన్. ఆ పదవిని ఆయన పూర్తి ఏకపక్షంగా నిర్వహించారనే పేరు తెచ్చుకున్నారు. టీడీపీ సభ్యులపై ఆయన విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐదేళ్లపాటు స్పీకర్ స్థానంలో ఉన్నా వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారని తమ్మినేని సీతారాంను చెప్పుకుంటూ ఉంటారు. అయితే తాజా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన గతంలో వ్యవహరించిన తీరుపై ప్రతీకారం తీర్చుకోవాలని తెలుగు తమ్ముళ్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను శ్రీకాకుళం (Srikakulam) పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించింది. ఆయనకేమో ఆముదాల వలస ఇన్ ఛార్జ్ కావాలని ఆశించారు. కానీ అధిష్టానం ఆయనకు మరొక బాధ్యత అప్పగించింది. దీనిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ ఇచ్చిన పలు కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదు. కేసుల భయం వెంటాడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు సర్పంచిగా ఉన్న భార్య, కుమారుడు వైసీపీని వీడితేనే భవిష్యత్తు ఉంటుందని తమ్మినేని సీతారాంకు చెప్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఆయనకు ఎంట్రీ లేదు. కాబట్టి జనసేనవైపు (Janasena) వెళ్తే బాగుంటుందని తమ్మినేని సీతారాం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేయడంతో కొన్ని పాత పరిచయాలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ దిశగా ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.













