టీడీపీ మళ్లీ అదే తప్పు చేస్తోందా..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి. లేదంటే ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణలు పూర్తిగా డీలా పడిపోయాయి. అనేకమంది నేతలపై కేసులు నమోదయ్యాయి. ఆర్థికంగా కూడా బాగా చితికిపోయారు. ఇలాంటి స్థితి నుంచి బయటపడాలంటే పార్టీ కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే కేడర్ లో మళ్లీ జోష్ వస్తుంది. పార్టీ మనుగడకు మార్గం సుగమం అవుతుంది. అయితే పాత తప్పుల నుంచి టీడీపీ ఇంకా బయటపడలేదనే టాక్ ఇంటాబయటా వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఫుల్ జోష్ తో ఉంటుంది. కేడర్ కూడా తాము గెలిచిపోతున్నామనే ధీమాలో ఉంటుంది. ఒక్కోసారి ఈ అతి ధీమానే పార్టీ కొంప ముంచుతుంది. 2019 ఎన్నికల్లో ఇదే జరిగింది. మళ్లీ తామే అధికారంలోకి వచ్చేస్తున్నామనే ధీమాతో ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. చివరకు అదే కొంపముంచింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం, దశాబ్దాలుగా పార్టీని భుజాలపై మోస్తున్న వాళ్లను పక్కన పెట్టడం లాంటి అంశాలు పార్టీని అధికారానికి దూరం చేశాయి.
ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. కేడర్ మంచి కసితో ఉంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఈ అవకాశాన్ని పార్టీ సద్వినియోగం చేసుకున్నప్పుడే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా పార్టీ అధినేత కొన్ని తప్పులు చేస్తున్నారనే టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీలో టికెట్లు దక్కని నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. వాళ్లకు గ్రౌండ్ లెవల్లో పెద్దగా బలం లేకపోయినా వాళ్లను పార్టీలో చేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్లకు టికెట్ ఇస్తే ఆయా స్థానాల్లో మళ్లీ ఓడిపోవడం ఖాయమని పార్టీ కేడర్ భయపడుతోంది.
వైసీపీలో గెలవలేని వాళ్లు టీడీపీలోకి వచ్చేసరికి గెలుస్తారా.. అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇలా కొత్తగా వచ్చిన వాళ్లకు టికెట్లు ఇస్తే ఎంతోకాలం నుంచి పార్టీకి సేవలందిస్తున్న వాళ్లు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి పార్టీని నమ్ముకున్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. మంచి మంచి లీడర్లు పార్టీని వీడిపోతున్నా వైసీపీ అధినేత జగన్ డోంట్ కేర్ అంటున్నారు. తాను అనుకున్నదానికి కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు కూడా జగన్ లాగే పార్టీకోసం పనిచేస్తున్న వాళ్లను పట్టించుకోవాలని.. కొత్తగా వచ్చిన వాళ్లను అందలం ఎక్కించవద్దని కోరుతున్నారు. మరి చూడాలి కేడర్ సూచనలను అధినేత ఏమాత్రం పట్టించుకుంటారో..!













