టీడీపీ ఎంపీల రాజీనామా..? వైసీపీని ఇరుకున పెట్టేందుకేనా..?
రాజకీయాలంటేనే ఎత్తులు పైఎత్తులు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పార్టీలు మరింత ముందుంటాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎత్తుగడలు వేయడంలో వాటికవే దిట్ట. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు విభజన హామీలపై పదే పదే ప్రశ్నించింది వైసీపీ. బీజేపీతో కుమ్మక్కయిన టీడీపీ.. విభజన హామీల ఊసే ఎత్తట్లేదని విమర్శించింది. తమకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి విభజన హామీలు నెరవేరుస్తామని మాటిచ్చింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో నాడు వైసీపీ అనుసరించిన స్ట్రాటజీనే ఇప్పుడు టీడీపీ కూడా అనుసరించేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రం విడిపోయి ఎనిమిదిన్నరేళ్లవుతోంది. అయితే ఇప్పటికీ విభజనచట్టంలోని పలు హామీలు ఇంకా అమలు కాలేదు. ముఖ్యంగా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య ఎన్నో సమస్యలు కొలిక్కిరాలేదు. పలు ఆస్తుల పంపకాలు కూడా అలాగే ఉండిపోయాయి. కేంద్రం విభజనచట్టంలో ఏపీ, తెలంగాణలకు పలు హామీలు నెరవేరుస్తామని మాటిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడపలో స్టీల్ ప్లాంట్ సహా పలు జాతీయ సంస్థలను నెలకొల్పుతామని తెలిపింది. ఇందులో కొన్ని హామీలు నెరవేరాయి. కానీ ఇప్పటికీ నీటిపంపకాలు, ఆస్తుల విభజన… లాంటి అపరిష్కృతం కాని అంశాలు చాలానే ఉన్నాయి. పలుమార్లు కేంద్ర హోంశాఖ అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులతో చర్చించినా ఈ సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. వైసీపీని ఇరుకున పెట్టేందుకు విభజన హామీల అంశాన్ని తెరమీదకు తీసుకురావాలనుకుంటోంది. తమకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వచ్చి రాష్ట్రానికి రావాల్సిన అన్నింటినీ సాధించి తీరుతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయినా ఇప్పటికీ కేంద్రాన్ని అడగట్లేదని.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని టీడీపీ అంటోంది. పార్లమెంటులో తగినంత బలమున్నా వైసీపీ ప్రశ్నించట్లేదని.. ఆరోపిస్తోంది. 25 మంది ఎంపీలను ఇస్తా చాలు.. అన్నీ తీసుకొస్తానన్న జగన్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడగుతోంది.
ఇప్పుడు విభజనచట్టంలోని హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో ఎంపీలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో చంద్రబాబును కలిసి ఈ ప్రతిపాదని చేసినట్లు తెలుస్తోంది. విభజనచట్టంలోని హామీల కోసం రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని ఆయన చంద్రబాబుకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అలా చేస్తే వైసీపీ ఎంపీలపై ఒత్తిడి పెరుగుతుందని.. వాళ్లు కూడా రాజీనామాలు చేసే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తమ ఎంపీలు రాజీనామా చేస్తారా లేదా అనేదానిపై చంద్రబాబు స్పందించలేదు. విభజనచట్టంలోని హామీలకోసం రాజీనామా చేయడమంటే కేంద్రాన్ని ఇరుకున పెట్టడమే. మరి చంద్రబాబు ఆ పని చేయగలరా.. అనేదే ఇప్పుడు ప్రశ్న.













