TDP MLCs: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ట్విస్ట్..! వెనుకబడిన వర్గాలకే పట్టం..!!
తెలుగుదేశం పార్టీ (TDP) ఎప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసినా చివరి నిమిషం వరకూ నాన్చుతూ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల (MLC Candidates) ఎంపికలోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. రేపు నామినేషన్లకు చివరి రోజు కాగా ఈరోజు సాయంత్రం అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలోనూ అనేక ట్విస్టులు ఇచ్చింది. ఇన్నాళ్లూ వినిపించిన ఆశావహ అభ్యర్థుల పేర్లు జాబితాలో లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే వెనుకబడిన సామాజిక వర్గాలకు (Backward castes) అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా టీడీపీ మరోసారి తమ ప్రాధాన్యత ఏంటో చాటిచెప్పింది.
ఏపీలో మొత్తం ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) జరుగుతున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని జనసేనకు (Janasena) కేటాయించింది. ఆ పార్టీ తరపున నాగబాబు (Nagababu) ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందని భావించారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ ముగ్గురు అభ్యర్థులనే ప్రకటించింది. ఒక స్థానాన్ని బీజేపీకి వదిలేసింది. టీడీపీ తరపున కావలి గ్రీష్మ (Kavali Greeshma), బీద రవిచంద్ర యాదవ్ (Beeda Ravichandra Yadav), బీటీ నాయుడు (BT Naidu) బరిలోకి దిగబోతున్నారు. రేపు వీళ్లంతా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కావలి గ్రీష్మ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు (Srikakulam District( చెందిన ఎస్సీ నేత. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి (Prathibha Bharathi) కుమార్తె. రాజాం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. 2017లో టీడీపీలోకి వచ్చిన గ్రీష్మ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ వరించిందని చెప్పొచ్చు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో గ్రీష్మకు అవకాశం కల్పించినట్లు సమాచారం.
బీద రవిచంద్ర యాదవ్ (Beeda Ravichandra Yadav) టీడీపీలో సీనియర్ నేత. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ యాదవ్ కు రవిచంద్ర యాదవ్ సోదరుడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీద రవిచంద్ర యాదవ్ కు ఎమ్మెల్సీ వరించింది.
మూడో స్థానాన్ని కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బీటీ నాయుడుకు (BT Naidu) కేటాయించింది టీడీపీ. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా.! 2009, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన కుటుంబానికి, పార్టీకి ఎంతో అండదండలు అందించారు. బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక టీడీపీ మూడు స్థానాలను ఓసీలకు కేటాయించకుండా పూర్తిగా వెనుకబడిన సామాజిక వర్గాలకే కేటాయించడం ఆశ్చర్యం కలిగించింది. ఎమ్మెల్సీ ఆశించిన పలువురు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.













