TDP Failure : ఏపీలో టీడీపీ నేతల హత్యలు..! చంద్రబాబు చేతకానితనమేనా..!?
ఆంధ్రప్రదేశ్ లో 48 గంటల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. చనిపోయిన ఇద్దరూ టీడీపీ కార్యకర్తలే..! ఒకరు చిత్తూరు జిల్లా పుంగనూరుకు (Punganur) చెందిన వ్యక్తి కాగా.. మరొకరు కర్నూలు (Kurnool) నగరానికి చెందిన వ్యక్తి. వీళ్లిద్దరూ టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నాయకులే.! ఈ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు వైసీపీ నేతలు. ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు… కక్షలొద్దు, ప్రతీకారాలొద్దు అని సూక్తులు వల్లిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కిమ్మనకుండా పని చేసుకుంటూ పోతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను వెంటాడుతున్నారు.
పుంగనూరులో హత్యకు గురైన రామకృష్ణ (TDP Leader Ramakrishna Murder) అనే వ్యక్తి తనకు ప్రాణభయం ఉందని రెండు వారాల కిందటే ఓ వీడియో విడుదల చేశారు. అంతకుముందు నాలుగు నెలల క్రితమే టీడీపీ గెలిచిందని తన భార్య కేక్ కట్ చేస్తుండా ఆమెను వాహనం కింద తొక్కించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి తమకు ప్రాణరక్షణ కల్పించాలని స్థానిక ఎస్సై, సీఐకి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఎవరి నుంచి ప్రాణభయం ఉందో కూడా ఆయన పేర్లతో సహా వివరించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఫలితం ఇప్పుడు రామకృష్ణ హత్య. అతని కుమారుడు చావుబతుకుల్లో ఆసుపత్రిలో ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో (Chittoor District) ఇప్పటికీ పోలీసులు వైసీపీ నేతల కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఇక్కడ చక్రం తిప్పుతున్నారని స్థానిక కార్యకర్తలే చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా తమ మాట వినట్లేదని, ఇలాంటప్పుడు తాము ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నామని టీడీపీ కార్యకర్తలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయిన రామకృష్ణ చాలాకాలం క్రితమే పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు (Challa Babu) దృష్టికి తనకు ప్రాణభయం ఉన్నట్టు చెప్పారు. కానీ చల్లా బాబు కూడా లైట్ తీసుకున్నారు. అటు పోలీసులు, ఇటు పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో రామకృష్ణ హత్యకు గురయ్యారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్లే హత్యలకు గురయ్యారు.. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా కూడా సొంత పార్టీ కార్యకర్తలే హత్యలకు గురవుతున్నారని పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కక్ష సాధింపులు వద్దు.. ప్రతీకార రాజకీయాలు వద్దు అని అధినేత చంద్రబాబు చెప్తున్నారు. కానీ కిందిస్థాయిలో కేడర్ మాత్రం బలిపశువులవుతున్నారు. ఇందుకు వైసీపీ అనుకూల పోలీసులు, అధికారులే కీలక స్థానాల్లో ఒక కారణం కాగా.. టీడీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు వైసీపీ వాళ్లతో అంటకాగడం కూడా మరో కారణం. ఇటీవల చంద్రబాబు కూడా జిల్లాలో పర్యటించినప్పుడు వైసీపీ నేతలతో అంటకాగొద్దని హెచ్చరించడానికి ఇది కూడా ఓ కారణం. ఇదంతా చూస్తుంటే టీడీపీ హైకమాండ్ చేతకానితనం వల్లే పార్టీ కేడర్ ఇబ్బందులు పడుతోందని అర్థమవుతోంది. ఇప్పటికైనా హైకమాండ్ పార్టీ కేడర్ కు రక్షణ కల్పిస్తుందేమో చూడాలి.













