టీడీపీ వెంటే జనసేన..!! ఎవరికేంటి లాభం…!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం సంచలనం కలిగిస్తోంది. ఇది తమకు మేలు చేస్తుందని.. టీడీపీ పనైపోయిందని వైసీపీ భావిస్తోంది. చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండించింది కానీ ఆయనతో కలిసి ప్రయాణం చేసేందుకు మాత్రం ఆ పార్టీ ఆసక్తి చూపించట్లేదు. జనసేన మాత్రం తాను టీడీపీ వెంటే అని తేల్చి చెప్పేసింది. మరి టీడీపీతో జనసేన ప్రయాణం చేయడం వల్ల ఎవరికి లబ్ది కలుగుతుంది.. రెండూ కలిస్తే వైసీపీని ఓడించడం సాధ్యమా.. అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన వెంటనే పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి విజయవాడ పయనమయ్యారు. అయితే ఆయన ఫ్లైట్ ల్యాండింగ్ కు ఏపీ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరారు. సరిహద్దుల్లోనే పవన్ కల్యాణ్ ను అడ్డుకున్నారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు పైనే బైఠాయించి పవన్ కల్యాణ్ హడావుడి చేశారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఇంత హడావుడి చేస్తున్నారేంటి.. అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా చెప్పాలంటే జనసేన చేసిన హడావుడి టీడీపీ కూడా చేయలేదు.
చంద్రబాబు అరెస్టును పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. అంతేకాక.. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయడం ఖాయమని డిసైడ్ అయిపోయింది. అందుకే పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అని వైసీపీ పదేపదే విమర్శిస్తోంది. ఇప్పుడు కూడా చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ హడావుడి ఎక్కువైపోయిందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
వైసీపీని గద్దె దించేందుకు ఎవరితోనైనా కలుస్తానని పవన్ కల్యాణ్ పదే పదే చెప్తున్నారు. ఒంటరిగా వెళ్తే ఓట్లు చీలి వైసీపీకి లబ్ది చేకూరుతుందని.. గత ఎన్నికల్లో అదే జరిగిందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే టీడీపీతో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కచ్చితంగా టీడీపీ –జనసేన కూటమికి పడుతుందని.. అది ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. సర్వేలు కూడా ఈ విషయాన్ని తెలియజేశాయని.. అందుకే ఆ రెండు పార్టీలను కలవనీయకుండా చేసేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చెయ్.. అని వైసీపీ నేతలు అటు పవన్ కు, ఇటు చంద్రబాబుకు పదేపదే సవాళ్లు విసురుతున్నారు. ఇలాగైనా వాళ్లిద్దరినీ వేరు చేయాలనేది వైసీపీ ప్లాన్. కానీ పవన్ మాత్రం ఈసారి టీడీపీతో కలిసి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.













