కొడాలి నానిపై ఎన్నారైని దింపనున్న టీడీపీ..! టికెట్ ఖరారు చేసిన చంద్రబాబు?
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. టీడీపీని ముఖ్యంగా చంద్రబాబును, లోకేశ్ ను టార్గెట్ చేయడంలో కొడాలి నాని తర్వాతే ఎవరైనా.! టీడీపీలోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొడాలి నాని ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. దీంతో కొడాలి నాని మరింత రెచ్చిపోయారు. చంద్రబాబును టార్గెట్ చేయాలంటే కొడాలి నాని తర్వాతే ఎవరైనా.. అనే పేరు తెచ్చుకున్నారు. దీంతో కొడాలి నానిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది టీడీపీ. ఎలాగైనా ఈసారి కొడాలి నాని స్పీడుకు బ్రేక్ వేయాలని ట్రై చేస్తోంది. ఇందుకోసం గుడివాడలో ఒక ఎన్నారైని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తోంది.
గుడివాడలో కొడాలి నానిపై ఈసారి ఎన్నారైని బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. పారిశ్రామికవేత్తగా పేరొందిన వెనిగళ్ల రామును ఈసారి గుడివాడ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. వెనిగళ్ల రాము అమెరికాలో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అంతేకాక ఇక్కడ కేశినేని డెవలపర్స్ లో కూడా భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో కొడాలి నానిని ఢీకొట్టేందుకు వెనిగళ్ల రామే సరైన అభ్యర్థి అని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి వెనిగళ్లు రాము సన్నిహితుడిగా చెబ్తున్నారు. చిన్ని ద్వారానే వెనిగళ్ల రాము చంద్రబాబును కలిసి తన ఆసక్తిని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు కూడా సంసిద్ధత వ్యక్తం చేసి గ్రౌండ్ లెవల్లో పని చేసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కొడాలి నాని కంచుకోటగా మారింది గుడివాడ. గత నాలుగు పర్యాయాలుగా కొడాలి నాని అక్కడ గెలుస్తూ వస్తున్నారు. రెండు సార్లు టీడీపీ నుంచి, మరో రెండు సార్లు వైసీపీ నుంచి కొడాలి నాని గెలుపొందారు. టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లిన తర్వాత చంద్రబాబు, లోకేశ్ పై తిట్లదండకం వినిపిస్తున్నారు కొడాలి నాని. ఒకే సామాజిక వర్గం నేతలే అయినప్పటికీ చంద్రబాబును తిట్టడంలో నాని తర్వాతే ఎవరైనా. దీంతో ఆ సామాజిక వర్గ నేతలు సైతం కొడాలి నానిపై కాస్త ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాక.. ఇటీవలికాలంలో చంద్రబాబు, లోకేశ్ పై మరింత విరుచుకపడుతుండడంతో ఈసారి కొడాలి నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని భావిస్తోంది టీడీపీ. అందుకే సరైన అభ్యర్థికోసం వెతుకుతున్న క్రమంలో వెనిగళ్ల రాము ఎదురుపడ్డారు. దీంతో ఆయనే సరైన అభ్యర్థి అని టీడీపీ భావిస్తోంది.
వెనిగళ్ల రాము కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఆయన కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన భార్య క్రిష్టియన్ అని సమాచారం. పైగా గత కొంతకాలంగా వెనిగళ్ల రాము కుటుంబం నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో అమెరికా నుంచి వచ్చేసి గుడివాడలోనే మకాం వేసి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు వెనిగళ్ల రాము సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక నేత రావి వెంకటేశ్వర రావు కూడా తన కంటే బలమైన అభ్యర్థి ఎవరైనా ముందుకొస్తే సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. గత ఎన్నికల్లో దేవినేని అవినాశ్ ను బరిలోకి దింపింది టీడీపీ. ఇప్పుడు అక్కడ అన్నివిధాలా బలమైన అభ్యర్థిని దింపాలనుకుంటోంది టీడీపీ. వెనిగళ్ల రామును ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థిగా భావిస్తోంది. మరి చూడాలి నానిపై ఫైట్ ఎలా ఉంటుందో..!













