TDP: టీడీపీ హైకమాండ్‌పై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు..!!
ఏపీలో తాజా పరిణామాలు టీడీపీలో (TDP) అంతర్గత అసంతృప్తి రగిలిస్తున్నాయి. వై.ఎస్.భారతీ రెడ్డిపై (YS Bharathi Reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను (Chebrolu Kiran) పోలీసులు ఆగమేఘాలపై అరెస్టు చేశారు. ఈ చర్య టీడీపీ హైకమాండ్‌ను (TDP High Command) ఇరకాటంలోకి నెట్టింది. గతంలో టీడీపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై వైసీపీ (YCP) నేతలు చేసిన తీవ్ర విమర్శలపై ఎలాంటి చర్యలూ తీసుకోని టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తను 24 గంటలు కూడా కాకముందే అరెస్ట్ చేయడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. బూతులతో రెచ్చిపోయిన వైసీపీ కేడర్ పైనా ఇలాగే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఇప్పుడు డిమాండ్ చేసున్నారు టీడీపీ కార్యకర్తలు.
చేబ్రోలు కిరణ్ ఐటీడీపీలో పని చేస్తున్నారు. వై.ఎస్. భారతీ రెడ్డిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంతలోనే టీడీపీ హైకమాండ్ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నంలో కిరణ్‌ను అరెస్టు చేశారు. కిరణ్ అరెస్టు టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అతని అరెస్టును కార్యకర్తలు పార్టీకి సేవ చేసిన వారికి శిక్షగా భావిస్తున్నారు. మనోళ్లను అరెస్టు చేస్తారు కానీ వైసీపీ వాళ్లను వదిలేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర నాయకులపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు వెల్లువెత్తాయి. అయితే, వీటిపై నాటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై కిరణ్ ను అరెస్టు చేయడాన్ని తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు.
చేబ్రోలు కిరణ్ అరెస్టు టీడీపీ హైకమాండ్‌ను సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టిందని చెప్పొచ్చు. అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే ప్రయత్నం చేసింది. కూటమి ప్రభుత్వ విలువలను, నీతినిజాయితీకి ఇది నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, కార్యకర్తల అసంతృప్తి పార్టీ ఐక్యతకు సవాలుగా మారింది. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోతే, కిరణ్ అరెస్టు న్యాయబద్ధతను కార్యకర్తలు ప్రశ్నిస్తారని హైకమాండ్ ఆందోళన చెందుతోంది.
కార్యకర్తలను శాంతింపజేయడానికి, గతంలో టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ సానుభూతిపరులపై ఫిర్యాదులను పరిశీలించాలని కొందరు సూచిస్తున్నారు. అదే జరిగితే రాజకీయ కక్షగా ముద్ర పడుతుందేమోననే భయం టీడీపీ హైకమాండ్ లో ఉంది. అయితే తాము కక్ష సాధించాలని చెప్పట్లేదని.. కేవలం తప్పు చేసిన వారిని శిక్షించాలని మాత్రమే కోరుతున్నామని టీడీపీ కేడర్ బదులిస్తోంది. కార్యకర్తల ఆందోళనలను పరిష్కరించడం, చట్టం అందరికీ సమానమేనని నిరూపించడం ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు.













